
'ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా' సభ్యులపై మణిపూర్ ప్రభుత్వం ఎఫ్ఐఆర్
ఈ వార్తాకథనం ఏంటి
మణిపూర్ రాష్ట్రంలో మరిన్ని ఘర్షణలు సృష్టించేందుకు ప్రయత్నించిన ఎడిటర్స్ గిల్డ్ సభ్యులపై మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిందని ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ తెలిపారు.
సీమా గుహ, భరత్ భూషణ్, సంజయ్ కపూర్ అనే ముగ్గురు సభ్యులపై కేసు నమోదు చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
ఎడిటర్స్ గిల్డ్ తన సభ్యులపై దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌పై ఇంకా స్పందించలేదు.
'ఎడిటర్స్ గిల్డ్ సభ్యులకు తాను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. మీరు ఏదైనా చేయాలనుకుంటే, స్పాట్‌ను సందర్శించండి. గ్రౌండ్ రియాలిటీని పరిశీలించండి. అన్ని సంఘాల ప్రతినిధులను కలవండి. మీరు తెలుసుకున్న వాటిని ప్రచురించండి. కొన్ని వర్గాలను మాత్రమే కాకుండా, అన్ని వర్గాలను కలుసుకొని నిజాలను తెలుసుకోవాలి' అని సీఎం చెప్పారు.
సీఎం
ఎడిటర్స్ గిల్డ్ మణిపూర్ విభాగం పక్షపాతంగా వ్యవహరించింది: బీరెన్ సింగ్
సెప్టెంబరు 2న 'ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా 'మణిపూర్‌లో జాతి హింసకు సంబంధించిన మీడియా రిపోర్టేజ్‌పై ఫ్యాక్ట్ ఫైండింగ్ మిషన్' నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికను 'ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ' తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.
రాష్ట్రంలో ఘర్షణలు చెలరేగిన సమయంలో ఎడిటర్స్ గిల్డ్ మణిపూర్ విభాగం పక్షపాతంగా వ్యవహరించినట్లు బీరెన్ సింగ్ చెప్పారు.
జాతి ఘర్షణల వివాదంలో ఎడిటర్స్ గిల్డ్ మణిపూర్ విభాగం ఎవరి పక్షం వహించకుండా ఉండవలసి ఉందన్నారు. కానీ ఎడిటర్స్ గిల్డ్ అలా చేయడంలో విఫలమైందన్నారు.
ఇదిలా ఉంటే, రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా అసాధారణ పరిస్థితులు నెలకొన్నట్లు శుక్రవారం లెఫ్టినెంట్ జనరల్ పిసి నాయర్ పేర్కొన్న విషయం తెలిసిందే.