కొన్ని టీవీ షోలు, యాంకర్లను బహిష్కరిస్తాం: ఇండియా కూటమి
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ ఇంట్లో జరిగిన ప్రతిపక్ష కూటమి 'ఇండియా' సమన్వయ కమిటీ తొలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. కొందరు టెలివిజన్ యాంకర్లు, షోలను బహిష్కరించాలని కూటమి నేతలు నిర్ణయించారు. త్వరలో బహిష్కరించే షోలు, యాంకర్ల జాబితాను విడుదల చేస్తామని వెల్లడించారు. కొన్ని టీవీ ఛానెల్‌లను పూర్తిగా బహిష్కరిస్తామని, కొన్ని ఛానెల్స్‌లోని యాంకర్లను మాత్రమే దూరం పెడుతామని వివరించారు. కొందరు టీవీ యాంకర్లు బీజేపీకి, ఆర్‌ఎస్‌ఎస్‌కు మద్దతిస్తున్నారని ప్రతిపక్ష పార్టీల నేతలు తరచూ ఆరోపిస్తున్నారు. రాహుల్ గాంధీ కూడా ఈ విషయాన్ని ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. ప్రభుత్వానికి మద్దతిచ్చే జర్నలిస్టులను ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకొని బహిష్కరించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
మూడు మీడియా సంస్థలపై పూర్తిస్థాయి నిషేధం!
మూడు మీడియా సంస్థలపై పూర్తి బహిష్కరణ ఉండొచ్చని టెలిగ్రాఫ్ వార్తాపత్రిక రాసుకొచ్చింది. ఈ మూడు మీడియా సంస్థలతో ఎలాంటి సంబంధం ఉండదని ప్రతిపక్ష పార్టీల మధ్య ఒప్పందం కుదిరిందని చెప్పింది. కోఆర్డినేషన్ కమిటీ సభ్యురాలు, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ 'గోడీ మీడియా' అనే పదాన్ని ఉపయోగించి హింట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇలాంటి యాంకర్లు సమాజంలో విద్వేషాన్ని వ్యాప్తి చేస్తారని ఎస్పీ నేత జావేద్ అలీ ఖాన్ అన్నారు. గత కొన్ని వారాలుగా తాము దీని గురించి వివరంగా చర్చించామని ఒక సీనియర్ నాయకుడు టెలిగ్రాఫ్‌తో అన్నారు. ఇది కేవలం రాజకీయ కోణంలో తీసుకున్న నిర్ణయం మాత్రమే అని, జర్నలిజం విలువలకు భంగం కలిగించే ఉద్దేశం తమకు లేదని ఆయన చెప్పుకొచ్చారు.