BR Naidu: గత ప్రభుత్వంలో తిరుమలలో అవకతవకలు.. తితిదే ఛైర్మన్
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్‌గా నియమితులైనందుకు అదృష్టంగా భావిస్తున్నానని బీఆర్ నాయుడు పేర్కొన్నారు. తనను ఈ బాధ్యతకు ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎన్డీయే పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేశారు. తిరుమల పవిత్రతను కాపాడడం తన ప్రధాన కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో తిరుమలలో పలు అవకతవకలు జరిగాయని, పవిత్రతకే నష్టం కలిగిందని దీంతో గత ఐదేళ్లలో తిరుమలకు వెళ్లదేని ఆయన తెలిపారు. తితిదే ఛైర్మన్ బాధ్యతలు నా జీవితంలో ఒక ముఖ్య మలుపుగా భావిస్తున్నానని నాయుడు చెప్పారు.
శ్రీవాణి ట్రస్టును రద్దు చేస్తాం
తిరుమలలో భక్తుల సౌకర్యాల కోసం పలు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భక్తులు కంపార్టుమెంట్లలో ఎక్కువ సేపు ఉండకుండా చూస్తామని, చిన్నపిల్లలకు ఇబ్బందులు లేకుండా పాలు, అల్పాహారం అందించాలని నాయుడు సిబ్బందికి సూచించారు. శ్రీవాణి ట్రస్టు రద్దు చేసి, కొత్త మార్గదర్శకాలను తీసుకువస్తామని చెప్పుకొచ్చారు. భక్తులకు నీళ్లు అందించడానికి గాజు సీసాల స్థానంలో పేపర్ గ్లాసులు ఉచితంగా ఇవ్వాలనుకుంటున్నామని ఆయన వివరించారు. తనపై వచ్చే విమర్శలకు సమాధానం చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.