కేరళను వణికిస్తున్న నిఫా వైరస్.. ఐదుకు చేరిన కేసులు.. లక్షణాలు ఇవే
నిఫా వైరస్ కేరళను వణికిస్తోంది. రాష్ట్రంలో తాజాగా మరో పాజిటివ్ కేసు నమోదైనట్లు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. కోజికోడ్‌లోని 24ఏళ్ల ఆరోగ్య కార్యకర్తకు వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు మంత్రి వెల్లడించారు. దీంతో కేరళలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య ఐదుకి చేరుకుంది. ప్రస్తుతానికి 706మంది కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నారు. వీరిలో 77మంది హై-రిస్క్ కేటగిరీ ఉండగా, 153మంది ఆరోగ్య కార్యకర్తలు ఉన్నారని తెలిపారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేరళ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. యంత్రాంగాలను సమన్వయం చేసేందుకు 19కోర్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఐసోలేషన్‌లో ఉన్న వారికి నిత్యావసరాలను అందించేందుకు వలంటీర్లను నియమించింది.
నిపా వైరస్ అంటే ఏమిటి? లక్షణాల ఎలా ఉంటాయి?
నిఫా అనేది జూనోటిక్ వైరస్. జంతువుల (గబ్బిలాలు లేదా పందులు వంటివి) నుంచి ఈ వైరస్ మానవులకు వ్యాపిస్తుంది. ఇది కలుషితమైన ఆహారం ద్వారా లేదా నేరుగా వ్యక్తుల నుంచి వ్యక్తులకు వ్యాపిస్తుంది. టెరోపోడిడే కుటుంబానికి చెందిన గబ్బిలాల్లో నిఫా వైరస్‌కు ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. నిపా వైరస్ సోకిన వ్యక్తుల్లో కొద్దిపాటి లక్షణాలతో పాటు తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యం, ప్రాణాంతక ఎన్సెఫాలిటిస్ వరకు దారి తీయొచ్చు. ఈ వైరస్ పందుల వంటి జంతువులలో కూడా తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగిస్తుంది. వ్యాధి సోకిన వ్యక్తులకు మొదట్లో జ్వరం, తలనొప్పి, మైయాల్జియా (కండరాల నొప్పి), వాంతులు, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది.
వైరస్ మరణాల రేటు 40శాతం - 75శాతం
నిఫా వైరస్ మానవ శరీరంలోకి వెళ్లిన 4 నుంచి 14 రోజుల కాలంలో తన ప్రభావాన్ని పూర్తిస్థాయిలో చూపిస్తుంది. నిఫా వైరస్ మరణాల రేటు 40శాతం నుంచి 75శాతం వరకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వైరస్ నుంచి చాలా మంది వ్యక్తులు పూర్తిగా కోలుకుంటారు. వీరు దీర్ఘకాలిక నరాల సంబంధిత రుగ్మతలతో బాధపడుతుంటారని నివేదికలు చెబుతున్నాయి. దాదాపు 20% మంది రోగులు మూర్ఛ రుగ్మత, నాడీ సంబంధిత రోగాలతో ఇబ్బంది పడుతుంటారు. వైరస్ సోకిన కొంత మంది వ్యక్తులు న్యుమోనియా, తీవ్రమైన శ్వాసకోశ సమస్యల బారిన పడవచ్చు.
వైరస్ కట్టడికి కంటైన్‌మెంట్ జోన్ల ఏర్పాటు
వైరస్ సోకిన వారితో సన్నిహితంగా ఉన్నవారిని గుర్తించడంతో పాటు వారిని ఐసోలేషల్‌లో ఉంచేందుకు పరిపాలన యంత్రాంగం తీవ్రమైన కృష్టి చేస్తోందని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ అన్నారు. హెల్త్ అడ్మినిస్ట్రేషన్ క్లినికల్ లక్షణాలను పర్యవేక్షిస్తోందని చెప్పారు. కోజికోడ్ జిల్లాలోని ఏడు గ్రామ పంచాయతీలు అటాన్చేరి, మారుతోంకర, తిరువళ్లూరు, కుట్టియాడి, కాయక్కోడి, విల్యపల్లి, కవిలుంపరలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించినట్లు ఆరోగ్య మంత్రి తెలిపారు. ఇన్ఫెక్షన్ వ్యాప్తిని పరిమితం చేయడానికి కంటైన్‌మెంట్ జోన్‌లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కంటైన్‌మెంట్ జోన్‌లోని అన్ని పాఠశాలల విద్యార్థులకు ఇంటి నుంచే తరగతులకు హాజరయ్యేలా ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి వి శివన్‌కుట్టి పబ్లిక్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌ను ఆదేశించారు.