25 మంది ప్రైవేట్ రంగ నిపుణులకు కేంద్రం కీలక పదవులు
25 మంది ప్రైవేట్ రంగ నిపుణులను కీలక పోస్టుల్లో నియమించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విషయాన్ని ఓ ప్రభుత్వ అధికారి శుక్రవారం వెల్లడించారు. ప్రైవేట్ రంగానికి చెందిన 25 మంది నిపుణులు త్వరలో కేంద్రంలో కీలక పదవుల్లో చేరనున్నట్లు అధికారి తెలిపారు. పాలనా సౌలభ్యాన్ని మరింత మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం ఈ చర్యను తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ముగ్గురు జాయింట్ సెక్రటరీలు, 22 మంది డైరెక్టర్లు/డిప్యూటీ సెక్రటరీల నియామకానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ (ఏసీసీ) ఆమోదం తెలిపిందని ఆయన చెప్పారు.
ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో వీరి పాత్ర కీలకం
సాధారణంగా, జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్, డిప్యూటీ సెక్రటరీ పదవులను ఆల్ ఇండియా సర్వీసెస్ - ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS), ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFOS), ఇతర సర్వీసు అధఇకారులతో భర్తీ చేస్తారు. అయితే అందుకు భిన్నంగా కేంద్రం ఆలోచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం పాలనలో కొత్త ప్రతిభను ప్రవేశపెట్టాలనే ఆలోచనతోనే 25 మంది ప్రైవేటు నిపుణులను కీలక పదవుల్లోకి తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. లేటరల్ ఎంట్రీగా వ్యవహరించే ఈ స్కీమ్‌ను 2018లోనే ప్రవేశపెట్టారు. ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాల్లో వీరు కీలకంగా వ్యవహరిస్తారు.