Page Loader
Rain Alert: రుతుపవనాలు రాక.. వచ్చే రెండ్రోజులు వర్షాలు.. మీ జిల్లా రిపోర్టు ఎలా ఉందంటే?
రుతుపవనాలు రాక.. వచ్చే రెండ్రోజులు వర్షాలు.. మీ జిల్లా రిపోర్టు ఎలా ఉందంటే?

Rain Alert: రుతుపవనాలు రాక.. వచ్చే రెండ్రోజులు వర్షాలు.. మీ జిల్లా రిపోర్టు ఎలా ఉందంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 02, 2025
10:48 am

ఈ వార్తాకథనం ఏంటి

మండుతున్న వేసవికి బ్రేక్ పడింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. ఈ రుతుపవనాల రాకతో ఆదివారం రాత్రి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాంతాల్లో ప్రజలకు ఊరట లభించింది. ఈ నేపథ్యంలో సోమవారం (జూన్ 2) అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. అదే విధంగా కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి,నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లోనూ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Details

మంగళవారం కొన్ని జిల్లాలో తేలికపాటి వర్షాలు

ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాతావరణ విషయాలకొస్తే, సోమవారం, మంగళవారం రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, వర్షాలు అప్పుడప్పుడూ ఉరుములు, మెరుపులతో కూడి ఉండవచ్చని తెలిపింది. సోమవారం నల్గొండలో గరిష్టంగా 39.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, కనిష్టంగా మహబూబ్‌నగర్‌లో 33.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ వర్షాలు వేసవికి తాత్కాలిక ఉపశమనం ఇచ్చే అవకాశం ఉన్నా.. వచ్చే రోజుల్లో వాతావరణ మార్పులు ఎలా ఉంటాయన్న దానిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.