Raghav chadha: సినిమా ఇంకా ఉంది మిత్రమా.. ఆప్‌కు రాఘవ్ చద్దా స్ట్రాంగ్ కౌంటర్
ఈ వార్తాకథనం ఏంటి
రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉపనేతగా ఉన్న రాఘవ్ చద్దాను ఆ పార్టీ తొలగించడం తీవ్ర వివాదానికి దారితీసింది. పంజాబ్‌కు సంబంధించిన సమస్యలను పార్లమెంట్‌లో సమర్థంగా లేవనెత్తకుండా మౌనం వహిస్తున్నారనే ఆరోపణలతో పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విమర్శలను రాఘవ్ చడ్డా ఖండించారు. పంజాబ్ తనకు కేవలం రాజకీయ అంశం కాదని, అది తన ఆత్మతో ముడిపడి ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఓ వీడియో విడుదల చేసి, "సినిమా ఇంకా మిగిలే ఉంది మిత్రమా!" అంటూ పార్టీకి గట్టి కౌంటర్ ఇచ్చారు. పంజాబ్‌తో తనకు ఉన్న బలమైన అనుబంధాన్ని ఆయన ప్రస్తావించారు.
వివరాలు
పార్టీ ఉద్దేశపూర్వంగా టార్గెట్ చేస్తోంది
రైతుల కోసం కనీస మద్దతు ధర (MSP)కు చట్టబద్ధత, నన్‌కనా సాహిబ్ కారిడార్, రాష్ట్రంలో భూగర్భ జలాల తగ్గుదల, భగత్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్లపై తాను పార్లమెంట్‌లో పలుమార్లు గళం విప్పానని గుర్తుచేశారు. పార్టీ తనను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తోందని కూడా ఆరోపించారు. పంజాబ్ సమస్యలను లేవనెత్తడంలో విఫలమయ్యానంటూ నా సహచరులు వీడియోలు విడుదల చేస్తున్నారు. కానీ పంజాబ్ నా కోసం రాజకీయమే కాదు.. అది నా ఇల్లు, నా భూమి, నా విధి అని అన్నారు. ఇక విడుదల చేసిన వీడియోకు ఇది కేవలం ట్రైలర్ మాత్రమే.. సినిమా ఇంకా మిగిలే ఉంది మిత్రమా! అని క్యాప్షన్ జోడిస్తూ, భవిష్యత్తులో మరింత బలంగా స్పందించనున్న సంకేతాలు ఇచ్చారు.