
బీఎంసీ కోవిడ్ స్కామ్ దర్యాప్తుకు సిట్ ఏర్పాటు చేసిన ముంబై పోలీసులు
ఈ వార్తాకథనం ఏంటి
కోవిడ్ సమయంలో బృహన్‌ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)లో జరిగిన రూ. 12,500 కోట్ల కుంభకోణంపై దర్యాప్తు చేయడానికి ముంబై పోలీసులు శుక్రవారం నలుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు.
ఈ బృందానికి ముంబై పోలీసు కమిషనర్ నాయకత్వం వహిస్తారు. సభ్యులుగా ఆర్థిక నేరాల విభాగం జాయింట్ కమిషనర్ (ఈఓడబ్ల్యూ), డిప్యూటీ కమిషనర్ (డీసీపీ), ఈఓడబ్ల్యూ అసిస్టెంట్ కమిషనర్ (ఏసీపీ) ఉంటారు.
కొన్ని రోజుల క్రితం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లు ఆరోపించిన కుంభకోణంపై విచారణకు సిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
బీఎంసీ కోవిడ్ స్కామ్‌కు సంబంధించిన కేసులో ఈడీ మహారాష్ట్ర వ్యాప్తంగా సోదాలు నిర్వహించిందని ఆనంతరం ముంబై పోలీసులు సిట్ ఏర్పాటు చేసారు.
ఈడీ
పలువురికి ఈడీ సమన్లు
స్కామ్ కేసులో మహారాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈడీ దాడుల్లో రూ.68.65లక్షల నగదు, 50కి పైగా స్థిరాస్తుల పత్రాలను స్వాధీనం చేసుకుంది.
రూ.2.46కోట్ల విలువైన ఆభరణాలతో పాటు పలు ఎలక్ట్రానిక్ పరికరాలు, రూ.15కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తెలిపింది.
ఈ క్రమంలో జూన్ 22న ఐఏఎస్ అధికారి సంజీవ్ జైస్వాల్‌ను విచారణకు రావాలని సమన్లు జారీ చేసింది. కానీ జైస్వాల్ హాజరు కాలేదు. ఆయనకు మరోసారి సమన్లు జారీ చేయనున్నారు.
డాక్టర్ హరిదాస్ రాథోడ్, రమాకాంత్ బిరాదార్ తదితరులకు ఈడీ త్వరలో సమన్లు పంపి, వారి వాంగ్మూలాలను నమోదు చేసి, విచారణకు పిలవనుంది. ఉద్ధవ్ ఠాక్రే వర్గం నాయకుడు ఆదిత్య ఠాక్రే సన్నిహితుడు సూరజ్ చావాకు కూడా ఈడీ సమన్లు పంపింది.