Arunachal Pradesh: ప్రపంచంలోనే అతి పొడవైన టన్నెల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రపంచంలోనే అతి పొడవైన ట్విన్-లేన్ టన్నెల్ (సెలా టన్నెల్)ను ప్రారంభించారు. ఇటానగర్‌లో జరిగిన 'విక్షిత్ భారత్ విక్షిత్ నార్త్ ఈస్ట్' కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ.. టన్నెల్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టకు ప్రధాని మోదీ 2019లో శంకుస్థాపన చేశారు. సెలా టన్నెల్ అనేది అరుణాచల్ ప్రదేశ్‌లోని సెలా పాస్ మీదుగా తవాంగ్‌కు అన్నిరకాల కనెక్టివిటీని అందించే ఒక ఇంజనీరింగ్ అద్భుతం. రూ. 825కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌లో రెండు సొరంగాలు, 8కిలోమీటర్లకు పైగా అప్రోచ్ రోడ్లు ఉన్నాయి. ఈ టన్నెల్ మొత్తం పొడవు సుమారు 12కి.మీ. మొదటి సొరంగం 980మీటర్లు విస్తరించి ఉంది. రెండో సొరంగం 1.5 కి.మీ పొడవుతో ఉంటుంది.
కాంగ్రెస్‌పై మోదీ ఫైర్
టన్నెల్ ప్రారంభోత్సవంలో ప్రధాని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. సరిహద్దు ప్రాంతాలను అభివృద్ధి చెందకుండా చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని విమర్శించారు. అరుణాచల్‌లో రెండు లోక్‌సభ స్థానాలు మాత్రమే ఉన్నందున కాంగ్రెస్ సెలా సొరంగానికి ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. తాను మళ్లీ ఈ సొరంగాన్ని వీక్షించేందుకు వస్తానని మోదీ చెప్పారు. మూడోసారి గెలిచి.. ఇక్కడి వస్తానని స్పష్టం చేశారు. అలాగే, ఈ సందర్భంగా ప్రధాని మోదీ రూ.10,000 కోట్ల విలువైన UNNATI పథకాన్ని ప్రారంభించారు. మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్‌లలో రూ.55,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను అంకితం చేశారు.