గోదావరి బ్రిడ్జి పైపును పట్టుకొని వేలాడిన బాలిక.. ప్రాణాలు రక్షించండి అంటూ ఫోన్!
గోదావరి బ్రిడ్జి పైపును పట్టుకొని ఆరగంట పాటు ఓ బాలిక తన ప్రాణం కోసం పోరాడింది. ఇక 100 నంబర్ ను ఫోన్ చేసి ఆ బాలిక తన ప్రాణాలను దక్కించుకున్న తీరుపై ప్రస్తుతం ప్రశంసల జల్లు కురుస్తోంది. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన కీర్తినను సురక్షితంగా పోలీసులు కాపాడారు. కీర్తిన తల్లి పుప్పాల సుహాసిని భర్తతో కొన్నేళ్ల క్రితం విడిపోయింది. ఆమె కూలీ పనులు చేస్తూ కీర్తనను పోషిస్తోంది. ఈ నేపథ్యంలో సుహాసినికి మాయ మాటలు చెప్పి సురేష్ సహజీవనం చేశాడు. వారి సహజీవనం ఫలితంగా ఏడాది క్రితం ఓ పాప జన్మించింది. ఇక సుహాసినిని, కీర్తనను, ఏడాది పాపను చంపేసి, మరో పెళ్లి చేసుకోవాలని సురేష్ ప్లాన్ చేశాడు.
నదిలో గల్లంతైన సుహాసిని, ఏడాది పాప
కొత్త బట్టలు ఇప్పిస్తానంటూ సుహాసినిని, ఇద్దరు పిల్లలను సురేష్ కారులో రాజమహేంద్రవరం తీసుకెళ్లాడు. ఆదివారం తెల్లవారుజామున రావులపాలెంలోని వంతెన వద్ద సెల్ఫీ తీసుకుందామంటూ బ్రిడ్జికి చివరిలో ముగ్గురిని నిలబెట్టాడు. అనంతరం ముగ్గురిని నదిలోకి తోసేశాడు. ఇక సుహాసిని, ఏడాది పాప నదిలో పడిపోయారు. కీర్తన చేతికి బ్రిడ్జి పైపు చిక్కడంతో దాన్ని పట్టుకొని వేలాడింది. తర్వాత తన జేబులో ఉన్న ఫోన్ తీసి 100 నెంబర్‌కు ఫోన్ చేసింది. అనంతరం పోలీసులు ఆ బాలికను రక్షించారు. సుహాసిని, ఏడాది పాప నదిలో కొట్టుకుపోయారని పోలీసులు ధ్రువీకరించారు. ప్రస్తుతం పోలీసులు సురేష్ కోసం గాలిస్తున్నారు.