'రామసేతును జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించే ప్రక్రియ జరుగుతోంది: సుప్రీంకోర్టుకు తెలిపి కేంద్రం
రామసేతుపై కేంద్రం ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. రామసేతును 'జాతీయ స్మారక చిహ్నం'గా ప్రకటించే ప్రక్రియ జరుగుతోందని సుప్రీంకోర్టుకు కేంద్రం ప్రభుత్వం తెలిపింది. రామసేతను జాతీయ చిహ్నంగా ప్రకటించాలని మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిల్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు, కేంద్రప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. రామసేతను జాతీయ చిహ్నంగా ప్రకటించే విషయంపై అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. అయితే తాజాగా కేంద్రం అఫిడవిట్‌ను దాఖలు చేయకుండా, వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది. ప్రక్రియ ముగిసిన వెంటనే సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రప్రభుత్వానికి సూచించింది.
సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వద్ద అఫిడవిట్ పెండింగ్
సుప్రీంకోర్టు ఈ సందర్భంగా కీలక సూచనలు చేసింది. సుబ్రమణ్యస్వామి కావాలనుకుంటే, ఈ అంశంపై సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు అదనపు సమాచారాన్ని సమర్పించుకునేందుకు ధర్మానసం అనుమతి ఇచ్చింది. ఇలా చేయడం వల్ల రామసేతును 'జాతీయ స్మారక చిహ్నం'గా ప్రకటించే ప్రక్రియ మరింత వేగంగా జరుగుతుందని సుప్రీంకోర్టు ఆశాభావం వ్యక్తం చేసింది. ఇప్పటికే అఫిడవిట్‌ను సిద్ధం చేసి సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు పంపినట్లు సుప్రీంకోర్టుకు సొలిసిటర్ జనరల్ తెలిపారు. సంబంధిత మంత్రిత్వ శాఖ ఆమోదం కోసం వేచి చూస్తున్నట్లు ధర్మాసనానికి సొలిసిటర్ జనరల్ సమాధానం ఇచ్చారు.