బిహార్ కుల గణన ఫలితాలు విడుదల.. ఓబీసీల జనాభా 63%.. రాష్ట్రంలో యాదవులే టాప్
కుల ఆధారిత సర్వే ఫలితాలను విడుదల చేసిన మొదటి రాష్ట్రంగా బిహార్ అవతరించింది. బిహార్‌లో నిర్వహించిన కుల గణన సర్వే నివేదికను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. రాష్ట్ర మొత్తం జనాభా 13 కోట్లకు పైగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. రాష్ట్ర జనాభాలో ఓబీసీలు 63 శాతం ఉన్నారని జనాభా గణన వెల్లడించింది. జనాభాలో 36 శాతం అత్యంత వెనుకబడిన తరగతులు, 27.1 శాతం వెనుకబడిన తరగతులు, 19.7 శాతం షెడ్యూల్డ్ కులాలు, 1.7 శాతం షెడ్యూల్డ్ టైబ్స్, జనరల్ కేటగిరీకి చెందిన జనభా 15.5 శాతం ఉన్నట్లు నివేదిక చెబుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు బిహార్ ప్రభుత్వం ఈ నివేదికను విడుదల చేయడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నది.
ఓబీసీల్లో యాదవుల వాటా 14.27 శాతం
బిహార్ జనాభాలో భూమిహార్లు 2.86శాతం, బ్రాహ్మణులు 3.66శాతం, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సామాజిక వర్గానికి చెందిన కుర్మీలు 2.87 శాతం, ముసహర్‌లు 3 శాతం ఉన్నట్లు నివేదిక తేల్చింది. ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌కు చెందిన యాదవులు రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం ఓబీసీలు 63.1శాతం ఉండగా, అందులో యాదవుల వాటా14.27శాతంగా సర్వే పేర్కొంది. కుల గణన సర్వేను విడుదల అనంతరం సీఎం నితీష్ కుమార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. గాంధీ జయంతి సందర్భంగా డేటాను విడుదల చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. బిహార్‌లో కుల ప్రాతిపదికన జనాభా గణనకు సంబంధించి త్వరలో అఖిలపక్ష సమావేశాన్ని చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇది చారిత్రాత్మక ఘట్టమని ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ అన్నారు.