LOADING...
Leema Rose: తమిళనాడులో రిచెస్ట్ కాండిడేట్.. రూ.5,863 కోట్ల ఆస్తులు ప్రకటించిన అభ్యర్థి!
తమిళనాడులో రిచెస్ట్ కాండిడేట్.. రూ.5,863 కోట్ల ఆస్తులు ప్రకటించిన అభ్యర్థి!

Leema Rose: తమిళనాడులో రిచెస్ట్ కాండిడేట్.. రూ.5,863 కోట్ల ఆస్తులు ప్రకటించిన అభ్యర్థి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 07, 2026
10:32 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల్లో అత్యంత ధనికురాలు ఎవరో స్పష్టమైంది. తిరుచిరాపల్లి జిల్లా లాల్గుడి నియోజకవర్గం నుంచి ఏఐఏడీఎంకే తరఫున పోటీ చేస్తున్న లీమా రోజ్ తన కుటుంబ ఆస్తుల విలువను ఏకంగా రూ.5,863కోట్లుగా ప్రకటించి సంచలనం సృష్టించారు. ఈ వివరాలను ఆమె ఎన్నికల నామినేషన్ అఫిడవిట్‌లో వెల్లడించారు. అఫిడవిట్ ప్రకారం, లీమా రోజ్ పేరిట రూ.139 కోట్ల చరాస్తులు, రూ.910కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. అయితే ఆమె భర్త మార్టిన్ పేరిటే భారీగా ఆస్తులు నమోదయ్యాయి. ఆయనకు రూ.3,262 కోట్ల చరాస్తులు, రూ.887 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే వీరి కుమారుడు జోస్ టైసన్ మార్టిన్ పేరిట రూ.225 కోట్ల చరాస్తులు, రూ.439 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు.

వివరాలు

లీమా రోజ్ వద్ద 19,233గ్రాముల బంగారం

ఆదాయ వివరాల ప్రకారం, గత ఆర్థిక సంవత్సరంలో లీమా రోజ్ రూ.9.82 కోట్లు, ఆమె భర్త రూ.11.39 కోట్లు ఆదాయం పొందినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. నగదు విషయానికి వస్తే, లీమా రోజ్ వద్ద రూ.5 లక్షలు, ఆమె భర్త వద్ద రూ.56 లక్షలు ఉన్నట్లు తెలిపారు. ఆభరణాల వివరాలు కూడా విశేషంగా నిలిచాయి. లీమా రోజ్ వద్ద 19,233గ్రాముల బంగారం, 1,31,813 గ్రాముల వెండి, 1,217క్యారెట్ల వజ్రాలు ఉన్నట్లు వెల్లడించారు. అదేవిధంగా తన విద్యార్హతను ఆరో తరగతిగా పేర్కొన్న లీమా రోజ్, తనపై నాలుగు క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కూడా అఫిడవిట్‌లో వెల్లడించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం తప్పనిసరిగా సమర్పించే ఈ వివరాలు ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

Advertisement