Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న ఎండలు.. వడగాల్పులతో ఇబ్బందులు
ఈ వార్తాకథనం ఏంటి
వేసవి కాలం ఉగ్రరూపం దాల్చింది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి. ఏప్రిల్ నెలలోనే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరువవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 9 గంటలకే ఎండ ప్రభావం మొదలవుతుండగా, మధ్యాహ్నానికి రోడ్లు ఖాళీగా మారి కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. దీనికి తోడు వడగాల్పులు మరింత తీవ్రతరం కావడంతో ప్రజల దైనందిన జీవితం స్తంభిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతం ప్రస్తుతం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. నంద్యాల జిల్లా సంజామలలో అత్యధికంగా 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని అధికారులు తెలిపారు.
వివరాలు
భగ్గుమంటున్న ఎండలు
సుమారు 100 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో ఎండలు భగ్గుమంటున్నాయి. పరిస్థితి దృష్ట్యా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ 'ఆరెంజ్ అలర్ట్' ప్రకటించి ప్రజలను అప్రమత్తం చేసింది. ఎండల తీవ్రత, వడదెబ్బ నుండి రక్షణ పొందేందుకు నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు వెళ్లకపోవడం మంచిదని చెబుతున్నారు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉండేందుకు మజ్జిగ, కొబ్బరి నీరు, నిమ్మరసం వంటి ద్రవ పదార్థాలను తరచూ తీసుకోవాలని సూచిస్తున్నారు.
వివరాలు
అవసరమైతే తప్ప బయటికి రావొద్దు
అలాగే లేత రంగు కాటన్ దుస్తులు ధరించడం, బయటకు వెళ్లేటప్పుడు గొడుగు లేదా టోపీ వాడటం అవసరమని తెలిపారు. ఇదిలా ఉండగా, ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు కొంత ఊరటనిచ్చే సమాచారం కూడా వచ్చింది. రాబోయే మూడు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో ఉష్ణోగ్రతలు కొంత తగ్గి, వేడి నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అప్పటివరకు ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.