Page Loader
Andhra Pradesh: ఏపీలో పేర్లు, సరిహద్దుల మార్పులకు రంగం సిద్ధం.. కమిటీ ఏర్పాటుపై ప్రభుత్వం ప్రకటన
ఏపీలో పేర్లు, సరిహద్దుల మార్పులకు రంగం సిద్ధం.. కమిటీ ఏర్పాటుపై ప్రభుత్వం ప్రకటన

Andhra Pradesh: ఏపీలో పేర్లు, సరిహద్దుల మార్పులకు రంగం సిద్ధం.. కమిటీ ఏర్పాటుపై ప్రభుత్వం ప్రకటన

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 22, 2025
03:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పులు చేర్పులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. పరిపాలనా సౌలభ్యం కోసం ఈ మార్పులు చేపట్టాలని భావించిన ప్రభుత్వం, ఈ అంశంపై సమగ్ర అధ్యయనం చేయడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఏడుగురు మంత్రులను సభ్యులుగా నియమించారు. వీరిలో అనగాని సత్యప్రసాద్, పొంగూరు నారాయణ, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ ఉన్నారు. కమిటీకి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు.

Details

అభ్యంతరాలు, సూచనలను పరిశీలించాలి

ప్రజల అభిప్రాయాలను, ప్రజాప్రతినిధుల సూచనలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. జిల్లాల, మండలాల సరిహద్దులు నిర్ణయించే ముందు ప్రాంతాల చారిత్రక, సాంస్కృతిక నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అలాగే పరిపాలన తేలికగా సాగేందుకు డివిజన్లు, మండలాల మధ్య దూరాన్ని కూడా ఖచ్చితంగా అంచనా వేయాలని స్పష్టం చేసింది. జనాభా, భౌగోళిక పరిస్థితులు, అభివృద్ధి లక్ష్యాలను పరిగణనలోకి తీసుకొని మార్పులు ఉండాలని పేర్కొంది. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సూచనలను కూడా కమిటీ పరిశీలించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ, సీసీఎల్‌ఏకి అవసరమైన దిశానిర్దేశాలు ఇచ్చినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.