LOADING...
Telangana: ఉదయం నుంచే మండుతున్న ఎండలు.. మరో రెండ్రోజులు నిప్పుల కొలిమిలా రాష్ట్రం
ఉదయం నుంచే మండుతున్న ఎండలు.. మరో రెండ్రోజులు నిప్పుల కొలిమిలా రాష్ట్రం

Telangana: ఉదయం నుంచే మండుతున్న ఎండలు.. మరో రెండ్రోజులు నిప్పుల కొలిమిలా రాష్ట్రం

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 25, 2026
12:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతలతో పోలిస్తే పగటి పూట 4 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 7 గంటల నుంచే ఎండలు ఉద్ధృతంగా ఉండటంతో బయటకు రావడానికే భయపడుతున్నారు. నేడు, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖకు చెందిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని 33 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. శుక్రవారం అత్యధికంగా నిర్మల్ జిల్లాలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

వివరాలు

వృద్ధులు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలి

ములుగులో 44.3డిగ్రీలు, జగిత్యాలలో 44.1డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. నిన్న పగటి సమయంలో దాదాపు 8 జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ ప్రాంతాల్లో 40.8డిగ్రీలకుపైగా నమోదయ్యాయి. అధిక వేడి పరిస్థితుల నేపథ్యంలో పిల్లలు, వృద్ధులు, గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు, ఈ ఏడాది వర్షాకాలం సాధారణ సమయానికి ముందుగానే ప్రారంభమయ్యే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. విదర్భ నుంచి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతున్నట్లు తెలిపింది. శనివారం నుంచి ఈ నెల 30 వరకు ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

Advertisement