Year Ender 2024: ఈ ఏడాది సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పులివే!
ఈ ఏడాది భారత సుప్రీంకోర్టు అనేక చారిత్రక తీర్పులకు వేదికగా నిలిచింది. చట్టపరంగా, సామాజిక, రాజకీయ, వివక్ష, గుర్తింపు, జాతి ప్రయోజనాలకు సంబంధించిన అనేక ముఖ్యమైన తీర్పులను వెలువరించింది. పాత చట్టాల స్థానంలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్), భారతీయ నాగరిక సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్), భారతీయ సాక్ష్య అధినియం (బీఎస్‌బీ)లను ప్రవేశపెట్టడం, సుప్రీం కోర్టు ప్రాంగణంలో కొత్త న్యాయదేవత విగ్రహాన్ని ఆవిష్కరించడం వంటి ఘటనలు దేశ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించాయి. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ పదవీ విరమణ చేయడం, ఆయన స్థానంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా బాధ్యతలు చేపట్టడం కూడా ప్రధానమైన పరిణామాలుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో 2024లో వెలువడిన 10 ముఖ్యమైన తీర్పులపై ఒకసారి పరిశీలిద్దాం.
1. బిల్కిస్ బానో కేసు
గ్యాంగ్ రేప్ కేసు, కుటుంబంలోని ఏడుగురి హత్యలో నిందితులకు క్షమాభిక్ష ఇవ్వడాన్ని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు ఈ ఏడాది జనవరి 8న కొట్టివేసింది. 2. ఎన్నికల బాండ్లు ఫిబ్రవరి 15న సుప్రీం కోర్టు ఎన్నికల బాండ్ల అమలును రాజ్యాంగ విరుద్ధంగా తేల్చింది. రాజకీయ పార్టీలకు విరాళాల పేరుతో సాగుతున్న ఈ విధానాన్ని అసమర్థమని పేర్కొంది. 3. లంచగొండి నేతలు చట్టానికి అతీతులు కాదు మార్చి 4న సుప్రీం కోర్టు చట్టసభ సభ్యుల లంచాలకు సంబంధించి చారిత్రక తీర్పు ఇచ్చింది. లంచాలు తీసుకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రాసిక్యూషన్‌కు లోబడతారనీ, 1993 జేఎంఎం లంచం కేసు తీర్పును కొట్టివేస్తున్నట్టు తెలిపింది.
4. ఎస్సీ, ఎస్టీల కోటా ఉపవర్గీకరణ
ఆగస్టు 1న సుప్రీం కోర్టు ఎస్సీ, ఎస్టీ కులాలను ఉపవర్గీకరణ చేసి వారికి అదనపు ప్రయోజనాలు కల్పించవచ్చని తీర్పు చెప్పింది. 5. చైల్డ్ పోర్నోగ్రఫీ నేరం సెప్టెంబరు 23న సుప్రీం కోర్టు పిల్లల అశ్లీల మెటీరియల్ కలిగి ఉండటం పోక్సో చట్టం కింద నేరమని స్పష్టం చేసింది. 6. పౌరసత్వ చట్టం సెక్షన్ 6ఏ అక్టోబర్ 17న సుప్రీం కోర్టు అస్సాంలోని అక్రమ వలసదారులకు పౌరసత్వం కల్పించే సెక్షన్ 6ఏకు రాజ్యాంగ చెల్లుబాటు ఉంటుందని తీర్పు ఇచ్చింది. 7. యూపీ మదర్సా విద్యా చట్టం నవంబర్ 5న యూపీ మదర్సా బోర్డు విద్యా చట్టం-2004 రాజ్యాంగబద్ధమని పేర్కొంది. మదర్సాల విద్యార్థులపై హైకోర్టు ఇచ్చిన తీర్పును తిరస్కరించింది.
8. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి మైనారిటీ హోదా
నవంబర్ 8న అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి మైనారిటీ హోదా రాజ్యాంగపరంగా ఉందని తీర్పు వెలువరించింది. 9. బుల్డోజర్ న్యాయం నవంబర్ 13న సుప్రీం కోర్టు బుల్డోజర్ న్యాయం పేరిట ప్రభుత్వాలు చేస్తున్న కూల్చివేతలను తప్పుబట్టింది. 10. జైళ్లలో కుల వివక్ష అక్టోబర్ 13న జైళ్లలో కుల ప్రాతిపదికన వివక్ష రాజ్యాంగ విరుద్ధమని తీర్పు ఇచ్చింది. శారీరక శ్రమ, బ్యారక్‌ల విభజనలో జరుగుతున్న వివక్షను సుప్రీం తప్పుపట్టింది.