
గ్యాంగ్‌స్టర్ అతిక్ సోదరుల హత్యపై ఈనెల 24న సుప్రీంకోర్టులో విచారణ
ఈ వార్తాకథనం ఏంటి
పోలీసుల సమక్షంలో గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ , అష్రఫ్ హత్య జరగడంపై విచారించేందుకు మాజీ సీజేఐ అధ్యక్షతన స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ చేసిన పిటిషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు స్వీకరించింది.
ఏప్రిల్ 24న విచారించనున్నట్లు ధర్మాసనం పేర్కొంది. న్యాయవాది విశాల్ తివారీ తన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావించారు.
అత్యున్నత న్యాయస్థానం దానిని ఏప్రిల్ 24కి జాబితా చేసింది.
సుప్రీంకోర్టు
ఉత్తరప్రదేశ్ పోలీసులు అణచివేత పేరుతో క్రూరంగా వ్యవహరిస్తున్నారు: పిటిషనర్
2017 నుంచి జరిగిన 183 ఎన్‌కౌంటర్‌లపై విచారణకు మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ న్యాయవాది తివారీ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
పోలీసు కస్టడీలో ఉన్న అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ హత్యకు గురికావడంపై కూడా విచారణ చేపట్టాలని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
పోలీసు సమక్షంలో ఆదివారం ప్రయాగ్‌రాజ్‌లోని ఆసుపత్రికి తీసుకువెళుతుండగా అతిక్, అష్రఫ్‌లను ముగ్గురు కాల్చి చంపారు.
ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు అణచివేత పేరుతో క్రూరంగా వ్యవహరిస్తున్నారని పిటిషనర్ తన పిల్‌లో పేర్కొన్నారు. ఇటువంటి సంఘటనలు ప్రజాస్వామ్యానికి, చట్టబద్ధమైన పాలనకు తీవ్రమైన ముప్పు అని పిటిషనర్ చెప్పారు.