Page Loader
AP Rains: బంగాళాఖాతంలో తుపాన్ల ముప్పు.. రాష్ట్రంలో రక్షణ చర్యలు అవసరం 
బంగాళాఖాతంలో తుపాన్ల ముప్పు.. రాష్ట్రంలో రక్షణ చర్యలు అవసరం

AP Rains: బంగాళాఖాతంలో తుపాన్ల ముప్పు.. రాష్ట్రంలో రక్షణ చర్యలు అవసరం 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 14, 2024
01:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగాళాఖాతంలో తుపాను ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ నిపుణులు హెచ్చరించారు. సాధారణంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో రాష్ట్రానికి తుపాన్ల ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో నైరుతి రుతుపవనాలు తిరోగమించి, ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయి. ఈ సమయంలో సముద్ర ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడం, అల్పపీడనాలు ఏర్పడటానికి అనుకూల పరిస్థితులు ఉండటంతో వాయుగుండాలు, తుపాన్లుగా మారే అవకాశాలు ఉన్నాయి. సోమవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది తీవ్ర వాయుగుండం, తర్వాత తుపానుగా బలపడే అవకాశముందని అంచనా వేస్తున్నారు. గత పదేళ్లలో అక్టోబర్-డిసెంబర్ మధ్య 11 తుపాన్లు ఏర్పడగా, ఆవర్తనలు కొన్ని రాష్ట్రాల్లో తీరం దాటాయి.

Details

15 నుంచి 20 సెం.మీ. వర్షపాతం కురిసే అవకాశం

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, చెన్నై తీరం వరకు సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. అరేబియా సముద్రంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం సోమవారం వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాలతో రిజర్వాయర్లు, చెరువులు నిండుకుండల్లా మారాయి. వాయుగుండం లేదా తుపాను ప్రభావంతో కొన్ని చోట్ల 15 నుంచి 20 సెం.మీ. వర్షం కురిసే అవకాశముంది. ఇందుకు తగ్గట్టుగా కాలువలు, వంకలు, వాగులు బలహీనంగా ఉన్నాయో పరిశీలించి పటిష్టం చేయాలని డా. కేజే రమేష్, మాజీ డీజీ, భారత వాతావరణశాఖ సూచించారు.