
Tulsigowda: వృక్ష ప్రేమికురాలు తులసిగౌడ ఇకలేరు
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటకలో పర్యావరణ సేవలకు ప్రతీకగా నిలిచిన తులసిగౌడ (90) ఇకలేరు.
ఉత్తర కన్నడ జిల్లా అంకోలా తాలూకా హొన్నಳ್ಳಿ గ్రామానికి చెందిన తులసిగౌడ మంగళవారం వృద్ధాప్య సమస్యల కారణంగా తుదిశ్వాస విడిచారు.
పర్యావరణాన్ని ప్రేమించి, మొక్కలను సేద్యంగా చూసుకున్న ఆమె జీవితమంతా ప్రకృతి సేవకే అంకితం అయ్యింది.
17 ఏళ్ల పాటు అటవీశాఖలో దినసరి కూలీగా పని చేసిన తులసిగౌడ సేవలను గుర్తించిన అటవీశాఖ అధికారి యల్లప్పరెడ్డి ఆమెను స్థిర ఉద్యోగిగా నియమించారు.
అయితే ఆమె ఉద్యోగమో, పదవీ విరమణో... అన్నింటి కంటే ఎక్కువ ఆమె హృదయం మొక్కల పట్లనే మక్కువతో నిండి ఉండేది. రోడ్డు పక్కన వేలాదిగా మొక్కలు నాటి, వాటిని కాపాడుతూ పచ్చదనం పెంపొందించారు.
Details
2020లో పద్మశ్రీ అవార్డు
సుమారు 30 వేల మొక్కలను నాటి సంరక్షించిన తులసిగౌడ సాదాసీదా జీవన విధానంతో అందరి మనసును గెలుచుకున్నారు.
2020లో ఆమె విశేష సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతులమీదుగా ఆమె ఈ అవార్డును స్వీకరించారు.
తులసిగౌడను స్థానికులు 'వనదేవత'గా పిలిచేవారు. ఇటీవల ఆమె స్వగ్రామంలో తాగునీటి కోసం ఆనకట్ట నిర్మాణ సర్వే చేపట్టగా, అటవీ ప్రాంతంలోని చెట్లను నరుకుతామని తెలిసిన వెంటనే తులసిగౌడ అధికారులు వద్దంటూ నిరసన వ్యక్తం చేశారు.
తులసిగౌడ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం తెలిపారు.
ఆమె మొక్కల సంరక్షణకు జీవితం అంకితం చేసి, భూమి రక్షణ కోసం యువతకు మార్గదర్శకంగా నిలిచారని కొనియాడారు.