తెలంగాణలో వరి విలువ ఏటికేడు రెట్టింపు
తెలంగాణ వరి సాగు విస్తీర్ణం రికార్డు స్థాయిలో నమోదు అవుతోంది. ఏటికేడు సాగు విస్తీర్ణం పెరుగుతోంది. పుష్కల వర్షాలు, సాగునీటి లభ్యత కారణంగా తెలంగాణ రైతులు ఎక్కువ శాతం వరి సాగుపైనే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. అయితే తెలంగాణలో వరి రైతులు ఏప్రిల్ నెలలో ఆకాల వర్షాల కారణంగా భారీ పంటలు నష్టపోయిన విషయం తెలిసిందే. అయితే వారికి చేయూతనివ్వడానికి ప్రభుత్వం నష్టం పరిహారం అందించాలని ఉత్తర్వులు జారీ చేసింది. వరి సాగు విస్తీర్ణంపై కేంద్ర గణాంకాలశాఖ తాజాగా ఓ జాబితాను విడుదల చేసింది. తెలంగాణలో ఉత్పత్తవుతున్న వరి విలువ పదేళ్లలో దాదాపు రెట్టింపు అయిందని స్పష్టం చేసింది.
పండ్లు, కూరగాయాల ఉత్పత్తిలో తెలంగాణ వెనుకంజ
తెలంగాణలో 2011-12లో రూ.8,291.06 కోట్లు విలువ ఉండగా.. 2020-21 నాటికి రూ.16,533.50 కోట్లకు చేరడం విశేషం. ఈ పదేళ్ల కాలంలో 99.41 శాతం మేర వృద్ధి నమోదైంది. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇంతర భారీ స్థాయిలో విలువ వృద్ధి కాలేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వరి ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న పంజాబ్ పదేళ్ల కాలంలో 28.34శాతం మాత్రమే పెరిగింది. అయితే తెలంగాణలో పండ్లు, కూరగాయాల ఉత్పత్తి విలువ 46శాతం దిగజారింది. పత్తి పంటలో మహారాష్ట్ర, గుజరాత్ తర్వాతి స్థానంలో తెలంగాణ ఉంది.