
Telangana Rain Alert: హైదరాబాద్‌లో మారిన వాతావరణం.. మూడ్రోజులు భారీ వర్షాలు
ఈ వార్తాకథనం ఏంటి
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి మూడ్రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది.
హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్, అమీర్ పేట్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, పంజాగుట్ట, ఫిల్మ్ నగర్, ఖాజాగూడ, మెహిందీపట్నం, ఎస్ ఆర్ నగర్, దిల్ షుక్ నగర్, మలక్ పేట్, చాదర్ ఘాట్, ఎల్బీనగర్ వంటి ప్రాంతాలు భారీ వర్షం కారణంగా జలమయమయ్యాయి.
ఈ వర్షాలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
Details
ఎల్లో అలర్ట్ జారీ చేసిన అధికారులు
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నగరంలో మళ్లీ వర్షం పడే అవకాశముందని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.
ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్, ఖమ్మం, మెదక్, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, ములుగు జిల్లాల్లో కూడా వర్షాలు పడే అవకాశముందని వాతావరణ అధికారులు చెప్పారు.
ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పలుచోట్ల పిడుగులు పడే అవకాశం కూడా ఉందన్నారు.
సోమవారం సాయంత్రం, హైదరాబాద్‌తో పాటు అనేక జిల్లాల్లో వర్షం కురిసింది.
బాలానగర్, ఖైరతాబాద్, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, కూకట్ పల్లి, సుచిత్ర, కొంపల్లి, జీడిమెట్ల, ప్రగతినగర్, పటాన్ చెరు, మేడ్చల్, దుండిగల్, కృష్ణాపూర్, గండిమైసమ్మ, మల్లంపేట తదితర ప్రాంతాల్లో వర్షం పడింది.