Surat Diamond Bourse: ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల వ్యాపార కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల వ్యాపార కార్యాలయ భవనమైన 'సూరత్ డైమండ్ బోర్స్'తో పాటు సూరత్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌ను గుజరాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. సూరత్ డైమండ్ బోర్స్‌ను ప్రారంభించే ముందు ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యారు. సూరత్ డైమండ్ బోర్స్ ఆఫీస్‌తో పాటు ఎయిర్‌పోర్ట్ రావడం వల్ల అంతర్జాతీయ వజ్రాలు, ఆభరణాల వ్యాపారానికి సూరత్ ప్రపంచంలోనే అతిపెద్ద కేంద్రం కానుంది. సూరత్‌లో ఆగస్టులో ప్రారంభమైన డైమండ్ రీసెర్చ్ అండ్ మర్కంటైల్ (డ్రీమ్) సిటీలో భాగమైన ఈ భవనం ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా గుర్తింపు పొందింది.
రూ. 3,500 కోట్లతో నిర్మాణం
సూరత్ డైమండ్ బోర్స్ నిర్మాణం ఫిబ్రవరి 2015లో ప్రారంభమైంది. 2022 నాటికి పూర్తయింది. దాదాపు రూ. 3,500 కోట్లతో దీన్ని నిర్మించారు. వ్యాపారులు, సందర్శకులతో సహా 67,000 మంది సామర్థ్యం ఉండేలా సూరత్ డైమండ్ బోర్స్ నిర్మాణం చేపట్టారు. చెక్‌పాయింట్‌లు, పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సిస్టమ్, ఎంట్రీ గేట్ వద్ద కార్ స్కానర్‌లతో సహా హై-సెక్యూరిటీ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందులో 4,500 వజ్రాల వ్యాపార కార్యాలయాలు ఉన్నాయి. పెంటగాన్ విస్తీర్ణం కంటే సూరత్ డైమండ్ బోర్స్ భవనం పెద్దది. ఈ భవనంలో 175దేశాల నుంచి వజ్రాలు కొనుగోలు చేయడానికి వచ్చే 4200 కంటే ఎక్కువ మంది వ్యాపారులకు వసతి కల్పించవచ్చు. ఈ కార్యాలయం ద్వారా 1.5లక్షల మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి లభిస్తుంది.