TDP vs YSRCP: ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో వేడెక్కిన రాజకీయం.. నువ్వా నేనా అంటున్న వైఎస్సార్‌సీపీ, టీడీపీ
మరికొద్ది నెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు తెలుగుదేశం, వైఎస్సార్‌సీపీ తమ కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నాయి. ప్రణాళికల్లో భాగంగా టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో రా.. కదలి..రా ను నిర్వహిస్తోంది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రేపు(గురువారం) గుడివాడలో సభ నిర్వహించాలని టీడీపీ యోచిస్తోంది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ, కొడాలి నాని మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే.
అప్రమత్తమైన పోలీసులు
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని నియోజకవర్గం గుడివాడలో జరగనున్న సభను టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ సారి ఎన్నికలలో గుడివాడలో ఎలాగైనా కొడాలి నానిని ఓడించాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది. అయితే కొడాలి నాని కూడా గుడివాడలో ఎన్టీఆర్ వర్ధంతిలో భాగంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా గుడివాడలో వైఎస్సార్‌సీపీ, టీడీపీలు ఒకేరోజు కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు పోలీసులు అప్రమత్తమై అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.