LOADING...
#NewsBytesExplainer: తెలంగాణ రోడ్లపై 'ఫిట్‌నెస్‌ లేని' వాహనాల రాజ్యం.. ఒక్క భాగ్యనగరంలోనే ఎన్నో తెలుసా?
ఒక్క భాగ్యనగరంలోనే ఎన్నో తెలుసా?

#NewsBytesExplainer: తెలంగాణ రోడ్లపై 'ఫిట్‌నెస్‌ లేని' వాహనాల రాజ్యం.. ఒక్క భాగ్యనగరంలోనే ఎన్నో తెలుసా?

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 10, 2025
12:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ వ్యాప్తంగా రోడ్లపై తిరుగుతున్న ఎన్నో వాహనాలు దట్టమైన పొగను వెదజల్లుతూ ప్రయాణిస్తున్నాయి. వాటిలో చాలా వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కూడా లేదు. ఆర్టీసీ బస్సులు కూడా చాలావరకు కాలం చెల్లిపోయినవే అయినప్పటికీ, వాటిని రద్దు చేయడంలో పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అదేవిధంగా ఓవర్‌లోడ్‌తో ప్రయాణించే టిప్పర్లను.. అవి ప్రమాదానికి కారణమైనప్పుడే గుర్తిస్తారు! గతంలో బూరెలాల్ కమిటీ చేసిన సిఫారసులు కూడా అమలులోకి రాలేదు. ప్రభుత్వాలు మారినా, ప్రజల ప్రాణాలకు ప్రమాదంగా మారిన వాహనాలపై కఠిన చర్యలేమీ తీసుకోకపోవడం నిపుణులు ప్రశ్నిస్తున్నారు. చేవెళ్లలో 19 మంది చనిపోయిన ప్రమాదం తర్వాత మళ్లీ ఈ సమస్య మరోసారి ప్రధాన చర్చాంశమైంది.

వివరాలు 

39 వేల వాహనాలకు ఫిట్‌నెస్ లేదు! 

తెలంగాణలో ప్రస్తుతం సుమారు 39,000 వాహనాలు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్లు రవాణాశాఖ అంచనా. వీటిలో క్యాబ్‌లు, మధ్యస్థ, భారీ సరకు వాహనాలు, కాంట్రాక్ట్ బస్సులు ఉన్నాయి. వీటిలో సుమారు 25,000 వాహనాలు పన్నులూ చెల్లించకుండా తిరుగుతుండగా, దాదాపు 11,000 వాహనాలు పర్మిట్‌ లేకుండా నడుస్తున్నాయి. అయినప్పటికీ వీటి పై పోలీసులు, రవాణా అధికారులు గట్టిగా స్పందించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. వాహనానికి ఫిట్‌నెస్ లేకపోతే ప్రమాదం జరిగితే ప్రజలకు ఇన్సూరెన్స్ కూడా అందదు, చికిత్స ఖర్చులు వారి మీదే పడతాయి. అందువల్ల ఇలాంటి వాహనాలను తక్షణం స్క్రాప్ చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

వివరాలు 

రాష్ట్రంలో కాలం చెల్లిన వాహనాలు 42 లక్షలు 

రాష్ట్రంలో మొత్తం 42 లక్షల వాహనాలు జీవితకాలాన్ని దాటి నడుస్తున్నాయి. వీటిలో 31 లక్షలు రెండు చక్రాల వాహనాలే. మిగతా 5.5 లక్షల వరకు నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయి. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఈ వాహనాల సంఖ్య ఎక్కువ. వాహనం 15 సంవత్సరాలు దాటితే ఫిట్‌నెస్ తగ్గి పొగ ఉద్గారాలు పెరగడం, బ్రేకులు పనిచేయకపోవడం, మార్గమధ్యంలో ఆగిపోవడం వంటి సమస్యలు వస్తాయి. దీనివల్ల పర్యావరణానికి హాని, రోడ్డు ప్రమాదాలు, ప్రాణనష్టం జరుగుతోంది.

వివాహాలు 

పాత పద్ధతులే కొనసాగుతున్న ఫిట్‌నెస్ తనిఖీలు 

ఇప్పటికీ రవాణాశాఖ మాన్యువల్ పద్ధతిలో వాహనాల తనిఖీ చేస్తోంది. అనేక దేశాల్లో అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆటోమేటిక్ ఫిట్‌నెస్ టెస్టింగ్ సెంటర్లు ఉన్నాయి. అయితే మన రాష్ట్రంలో మాత్రం పాత విధానమే.దీని వల్ల అవినీతి అవకాశం పెరగడం,ప్రజల ప్రాణాలకు ముప్పు పెరగడం జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఆటోమేటిక్ సిస్టమ్‌ అమలులోకి వస్తే ఫిట్‌నెస్ లేని వాహనాలు రోడ్డుపైకి రాకుండా ఆపగలమని నిపుణులు చెబుతున్నారు. ఫిట్‌నెస్ లేని వాహనాలతోనే ప్రమాదాలు 2022లో ఫిట్‌నెస్ లేకుండా 15సంవత్సరాలు దాటి నడుస్తున్న వాహనాల వల్ల రాష్ట్రంలో 1,306 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీటిలో 418 మంది మరణించగా,1,100 మందికి పైగా గాయపడ్డారు. బ్రేకులు ఫెయిల్ అవడం,వాహనం అదుపు తప్పడం,అకస్మాత్తుగా ఆగిపోవడం వంటి కారణాలే వీటిలో ఎక్కువ.

వివరాలు 

త్వరలో ఫిట్‌నెస్ ఫీజులు భారీగా పెరుగుతాయి 

కేంద్ర ప్రభుత్వం పాత వాహనాలను స్క్రాప్ చేయించే విధానాన్ని బలంగా తీసుకువస్తోంది. 20 ఏళ్ల పైబడిన బస్సులు, లారీలు ఫిట్‌నెస్ పరీక్షకు వెళితే రూ.25,000 వరకు చెల్లించాల్సి వచ్చే అవకాశముంది. అలాగే కమర్షియల్ వాహనాలకు 8 ఏళ్ల తర్వాత, వ్యక్తిగత వాహనాలకు 10 ఏళ్ల తర్వాత ఫిట్‌నెస్ తప్పనిసరి చేయాలని ప్రతిపాదనలు పంపినట్టు సమాచారం.

వివరాలు 

సుప్రీం కోర్టు రోడ్డు భద్రతా కమిటీ ఆదేశాలు 

చేవెళ్ల ప్రమాదం నేపథ్యంలో సుప్రీంకోర్టు రోడ్డు భద్రతా కమిటీ హైదరాబాదులో సమీక్ష సమావేశం నిర్వహించింది. ఇకపై ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు బస్సులు, సరకు వాహనాలన్నింటికీ తప్పనిసరిగా ఫిట్‌నెస్ పరీక్షలు జరిపి, పరీక్షలో ఫెయిల్ అయితే వెంటనే స్క్రాప్ చేయాలని ఆదేశించింది. అలాగే పర్మిట్, ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్ లేకుండా నడిచే వాహనాలను జప్తు చేయాలని కూడా సూచించింది. ఓవర్‌లోడ్‌తో ఇసుక, కంకర వాహనాలు తిరిగితే తక్షణమే సీజ్ చేయాలని స్పష్టం చేసింది.