SLBC Tunnel: 8 మంది సజీవంగా ఉండే అవకాశం లేనట్లే..! మార్క్ చేసిన ప్రాంతంలో తవ్వకాలు వేగవంతం
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్(SLBC) వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ప్రమాదం జరిగి ఎనిమిది రోజులు గడిచినా లోపల చిక్కుకుపోయిన వారిని బయటికి తీసుకురావడం అత్యంత సవాల్‌గా మారింది.
ప్రస్తుతం జీపీఆర్ (గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్) మార్కింగ్ చేసిన ప్రాంతంలో తవ్వకాలు జరుగుతున్నాయి.
సజీవ అవకాశాలపై అనుమానాలు
సొరంగం లోపల పరిస్థితులు అత్యంత క్లిష్టంగా ఉన్నాయి. అక్కడి పరిస్థితుల దృష్ట్యా, లోపల చిక్కుకున్న ఎనిమిది మంది సజీవంగా ఉండే అవకాశం తక్కువగా ఉందని వాదనలు వినిపిస్తున్నాయి.
సొరంగంలో పేరుకుపోయిన మట్టిని తొలగించే ప్రక్రియ కొనసాగుతోంది. లోపల ఊట ఉండటంతో, సహాయక చర్యలు ఆశించిన స్థాయిలో పురోగమించలేకపోతున్నాయి. చిన్న తప్పిదం జరిగినా, రెస్క్యూ బృందాలు కూడా ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఉంది.
Details
అవశేషాల వెలికితీత
జీపీఆర్ ద్వారా కొన్ని అవశేషాలను గుర్తించడంతో, ఇవాళ వాటిని బయటకు తీసే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే అవశేషాలు ఒకేచోట కాకుండా విభిన్న ప్రదేశాల్లో ఉండటంతో, రెస్క్యూ ఆపరేషన్ పూర్తవ్వడానికి మరికొన్ని రోజులు పట్టొచ్చని అధికారులు చెబుతున్నారు.
ఫోరెన్సిక్ పరీక్షలకు సిద్ధం
టన్నెల్ వద్ద ఫోరెన్సిక్, వైద్య బృందాలతో పాటు అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. మృతదేహాలు వెలికితీసిన వెంటనే, వాటికి శవపరీక్ష నిర్వహించనున్నారు.
ఆ తర్వాత అవి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. కానీ మృతదేహాలను కుటుంబ సభ్యులు గుర్తించలేని పరిస్థితి ఉంటే, ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించనున్నారు.
Details
ప్రమాదం ఎలా జరిగింది?
ఫిబ్రవరి 22వ తేదీన నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని SLBC ఇన్‌లెట్ సొరంగంలో ఉదయం 8.30 గంటల సమయంలో టన్నెల్ పైకప్పు కూలిపోయింది.
అప్పటి నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఈ ఆపరేషన్‌లో దాదాపు 11 ప్రత్యేక విభాగాలు పాల్గొంటున్నాయి.
సహాయక చర్యలు పూర్తవ్వడానికి ఇంకా సమయం పట్టొచ్చని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.