Chandrababu: రౌడీయిజానికి చోటు లేదు.. ఇక్కడ ఉన్నది సీబీఎన్ ప్రభుత్వం: చంద్రబాబు హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకే తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించారని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఒకప్పుడు తెలుగువారిని 'మదరాసి' అని అవమానించిన పరిస్థితుల్లో.. తెలుగుజాతి అనే ప్రత్యేక గుర్తింపు ఉందని దేశానికి గుర్తుచేసిన మహానేత ఎన్టీఆర్ అని ఆయన అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలోని ఆయన విగ్రహానికి చంద్రబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన విస్తృతంగా ప్రసంగించారు. ఎన్టీఆర్ పాలనలో బీసీలకు స్థానిక సంస్థల్లో 20 శాతం రిజర్వేషన్లు అమలయ్యాయని చంద్రబాబు గుర్తు చేశారు. మహిళలకు ఆస్తిలో సగం వాటా కల్పించిన ఘనత కూడా ఎన్టీఆర్‌కే దక్కుతుందన్నారు.
Details
రాష్ట్రవ్యాప్తంగా 700 అన్న క్యాంటీన్లు ప్రారంభించాం
ఎన్టీఆర్ పార్టీ స్థాపించకముందు రాజకీయాల్లో పెద్దగా చదువు లేని వారే అధికంగా ఉండేవారని, చదువుకున్న వారికి ప్రాధాన్యత ఇచ్చిన నేత ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కూడా ఎన్టీఆర్‌నేనని చెప్పారు. కృష్ణా మిగులు జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కూ హక్కు ఉందని బలంగా వాదించారని, రాయలసీమకు నీళ్లు అందించడం తన బాధ్యత అని ఎన్టీఆర్ స్పష్టం చేశారని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలను సమర్థంగా అమలు చేస్తోందని చంద్రబాబు తెలిపారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా 700 అన్న క్యాంటీన్లు ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఉగాది రోజున మరో ఐదు లక్షల గృహప్రవేశాలు జరగనున్నాయని వెల్లడించారు.
Details
ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక పాత్ర
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని అన్నారు. మన పూర్వీకులు ఇచ్చిన భూములపై గత పాలకులు తమ ఫొటోలు పెట్టుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఎక్కడ చూసినా వచ్చే ఫిర్యాదుల్లో 80 శాతం భూముల వివాదాలేనని చెప్పారు. గత ప్రభుత్వం రూ.700 కోట్లు ఖర్చు చేసి సర్వే రాళ్లపై తమ ఫొటోలు వేయించుకుందని ఆరోపించారు. ఉద్యోగుల బకాయిలు చెల్లించి నిజమైన సంక్రాంతి కానుక ఇచ్చామని తెలిపారు. దేశంలోకి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25 శాతం పెట్టుబడులు రాష్ట్రానికే రావడం గర్వకారణమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి పూర్తిగా సహకరిస్తూ ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నామని చెప్పారు. టీడీపీ పని అయిపోయిందని చెప్పిన ప్రతి ఒక్కరి పని అయిపోయిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Details
రాష్ట్రం బాగుండాలనే తన లక్ష్యం
తాను ఎప్పుడూ అధికారంకోసం రాజకీయాలు చేయలేదని, దేశం, రాష్ట్రం బాగుండాలనే లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నానన్నారు. తనను నడిపిస్తున్న తెదేపా కుటుంబసభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. గొంతుపై కత్తిపెట్టి పార్టీ విడిచిపెట్టమంటే ప్రాణాలు వదిలే స్థాయిలో త్యాగానికి సిద్ధమైన కార్యకర్తలు ఉన్నారని అన్నారు. శాంతిభద్రతలు బాగుంటేనే రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుందని చెప్పారు. తనపై దాడి జరిగినా భయపడకుండా ప్రజల భద్రత కోసమే తాను పోరాడినట్లు తెలిపారు. రౌడీలకు రాష్ట్రంలో చోటు లేదని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల ముసుగులో రౌడీయిజం చేస్తే సహించబోమని హెచ్చరించారు. ఇది ఎన్డీఏ ప్రభుత్వం, సీబీఎన్ ప్రభుత్వం అని గుర్తుంచుకోవాలని అన్నారు.
Details
18 నెలల్లో సమాధానం ఇచ్చాం
కక్ష సాధింపుల కోసం రాజకీయాల్లోకి రాలేదని, రాష్ట్రం ఏమవుతుందన్న సందేహాలకు 18 నెలల్లోనే సమాధానం ఇచ్చామని చెప్పారు. అవినీతి సొమ్ముతో మీడియా సంస్థ పెట్టిన పార్టీతో పోరాడాల్సి రావడం దురదృష్టకరమని చంద్రబాబు విమర్శించారు. గ్రీన్‌కో, భోగాపురం ఎయిర్‌పోర్టు అంశాల్లో క్రెడిట్ చోరీ అంటూ సొంత మీడియాలో విషప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ల్యాండ్, శాండ్, వైన్ వ్యవహారాలు వైసీపీ క్రెడిట్ అని విమర్శించారు. సైబరాబాద్, అమరావతి, కియా, భోగాపురం ఎయిర్‌పోర్ట్ మాత్రం తమ ప్రభుత్వాల కృషి ఫలితమన్నారు. రెండింటికీ సంబంధం లేనప్పుడు క్రెడిట్ చోరీ ఎలా అవుతుందని ప్రశ్నించారు.
Details
మూడు రాజధానుల నాటకాన్ని ప్రజలు నమ్మలేదు
సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని అన్నట్లు జగన్ ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. బెంగళూరు లేదా ఇడుపులపాయలో ఉంటే అవే రాజధానులవుతాయా? అని ప్రశ్నించారు. మూడు రాజధానుల నాటకాన్ని ప్రజలు నమ్మలేదని, అందుకే మూడు ప్రాంతాల్లోనూ తమకు విజయం అందించారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని గర్వంగా ప్రకటించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.