Revanth Reddy: తెలంగాణ హక్కులపై వెనక్కి తగ్గేది లేదు : రేవంత్ రెడ్డి
ఈ వార్తాకథనం ఏంటి
'చచ్చినా తెలంగాణ కోసమే చస్తాం. ఈ మట్టిలోనే కలుస్తాం. ఈ ప్రజల కోసమే పోరాడతాం. ఇదే ఇక్కడున్న ప్రతి ఒక్కరి చిత్తశుద్ధి' అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ నీళ్లు, నిధులు, అభివృద్ధి విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నా... రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అందరం ఏకాభిప్రాయంతోనే ఉన్నామని ఆయన అన్నారు. 'నూటికి నూరు శాతం తెలంగాణ కోసం నిక్కచ్చిగా, నిటారుగా నిలబడతాం తప్ప... ఎవరికీ తలవంచం' అని ఘాటుగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర నీటి హక్కులను కాపాడటం తమ ప్రభుత్వ బాధ్యత అని సీఎం స్పష్టం చేశారు. 'పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు తొలి విడతగా 45 టీఎంసీలు, రెండో విడతగా మరో 45 టీఎంసీలకు అనుమతులు రావాల్సిందే.
Details
తెలంగాణ హక్కుల విషయంలో అందరం కలసి పోరాడాలి
అనుమతులు ఇవ్వకపోతే జూరాల నుంచి 70 టీఎంసీలను మేమే తరలిస్తాం. జూరాలకు వచ్చిన నీటిని వచ్చినట్లే ఇటు తరలిస్తాం. ఆపడానికి జగన్ వస్తారా? చంద్రబాబు వస్తారా? నరేంద్రమోదీ వస్తారా? ఎవరు అడ్డుకుంటారో నేను చూస్తానని సవాల్ విసిరారు. 'తెలంగాణ అభివృద్ధి, రైతుల పట్ల మా చిత్తశుద్ధిని ఎవరైనా ప్రశ్నిస్తే...తోలు తీస్తా అన్న వారి నాలుక కోస్తా. నా మాటలు అన్‌పార్లమెంటరీ అయితే రికార్డుల నుంచి తొలగించండి. కానీ ప్రజల మదిలో శాశ్వతంగా నిలిచేలా అధికారికంగా సభలో మాట్లాడుతున్నానని సీఎం వ్యాఖ్యానించారు. రాజకీయంగా అభిప్రాయ భేదాలు ఉన్నా, తెలంగాణ హక్కుల విషయంలో అందరం కలసి పోరాడాలని, ఏకతాటిపై నిలబడాలని పిలుపునిచ్చారు. ఈ కీలక సమయంలో సభలో లేకుండా బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు వెళ్లిపోయారని విమర్శించారు.
Details
రెండు గంటల పాటు ప్రసంగం
'ఈ కుర్చీలో ఉన్నంత కాలం తెలంగాణకు నష్టం కలిగించే చిన్న తప్పు కూడా చేయను. ఇది దేవుడి మీద ఆన. తెలంగాణ హక్కులకు ఎలాంటి భంగం కలగనివ్వనని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలో కృష్ణా నదీ జలాలపై శనివారం నిర్వహించిన స్వల్పకాలిక చర్చలో ఆయన సుమారు రెండు గంటల పాటు ప్రసంగించారు. వైఎస్ జగన్‌కు పంచభక్ష పరమాన్నాలు పెట్టి, కేసీఆర్ భుజం తట్టి ప్రోత్సహిస్తే... నేను మాత్రం చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపించా. ఇదే నా చిత్తశుద్ధి. 'రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపండి' అని అడిగితే... గౌరవంతో చంద్రబాబు ఆ పనులు ఆపించారు.
Details
మొదట నాకు తెలంగాణే
చంద్రబాబు నాయకత్వంలో పనిచేసిన తాను, ఆ నాయకత్వాన్ని, ఆ పార్టీని వదిలేశానని గుర్తు చేశారు. 'మొదట నాకు తెలంగాణ. ఆ తర్వాతే పార్టీ. నాలాంటి వాళ్లు తెలంగాణ ప్రజల హక్కులను తాకట్టు పెడతారా? అని ప్రశ్నించారు. తెలంగాణను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో తాను ముందుకు వచ్చానని చెప్పారు. కేసీఆర్ శాసనసభకు వచ్చి సూచనలు ఇస్తారని భావించామని, ప్రభుత్వం వాటిని పరిగణనలోకి తీసుకుంటుందని చెప్పామని వెల్లడించారు. అందుకే వారి డిమాండ్ మేరకే ఈ చర్చకు అవకాశం కల్పించామని తెలిపారు.
Details
ఎవరి తోలుతీయాలో ప్రజలే నిర్ణయిస్తారు
కృష్ణా జలాలపై చర్చ జరపాలని ప్రతిపక్షమే కోరిందని సీఎం తెలిపారు. పార్టీ కార్యాలయంలో సమావేశం పెట్టి తెలంగాణకు అన్యాయం జరుగుతోందని చెప్పిన బీఆర్ఎస్, బీఏసీలోనూ ఇదే అంశంపై చర్చ కావాలని అడిగిందని గుర్తు చేశారు. కానీ ముఖాముఖి చర్చకు మాత్రం సభకు రాలేదని విమర్శించారు. 'సభలు పెట్టండి... తోలు తీస్తాం అన్నారు. సభలోకి వచ్చి చర్చల్లో పాల్గొంటే ఎవరి తోలుతీయాలో నాలుగు కోట్ల మంది ప్రజలే నిర్ణయించేవారని వ్యాఖ్యానించారు. 1976లో కృష్ణా జలాల కేటాయింపుల కోసం బచావత్ ట్రైబ్యునల్ ఏర్పాటైనా, 2026కి వచ్చినా ఈ సమస్యకు పరిష్కారం దొరకలేదని అన్నారు. ఇది ఇప్పుడు 'రావణ కాష్టం'లా మారిందని వ్యాఖ్యానించారు.
Details
తప్పుడు లెక్కలు ఇచ్చింది కేసీఆర్ బంధువే
రాష్ట్ర విభజన సమయంలో అప్పటి నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ, కేసీఆర్‌కు సమీప బంధువు అయిన మురళీధర్‌రావు... తెలంగాణ హక్కులు దెబ్బతినేలా తప్పుడు లెక్కలతో ప్రణాళిక శాఖకు లేఖ రాశారని సీఎం ఆరోపించారు. ఆ లేఖ ఆధారంగానే 2015 జూన్ 18, 19 తేదీల్లో కేంద్రంతో జరిగిన చర్చల్లో తెలంగాణకు 299 టీఎంసీలు చాలని అంగీకరిస్తూ ఎస్‌కే జోషి సంతకం చేశారని తెలిపారు. ఆ సంతకం తెలంగాణకు ''మరణ శాసనం''గా మారిందన్నారు. తెలంగాణకు మంజూరైన 24 ప్రాజెక్టుల సామర్థ్యం ప్రకారం 490 టీఎంసీలు కావాలని ఎందుకు కోరలేదని ప్రశ్నించారు. 2016లోనూ ఇదే తరహాలో సంతకాలు జరిగాయని, ఆ సమావేశానికి చంద్రబాబు, కేసీఆర్ హాజరయ్యారని గుర్తు చేశారు.
Details
రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు
నీటి పంపకాలపై తీర్పు వచ్చే వరకూ పాత ఒప్పందం ప్రకారమే కొనసాగుతామని 2020లోనూ చెప్పడం వల్ల ఏపీకి 100-200 శాతం అనుకూలంగా మారిందన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలిచ్చేందుకు సిద్ధమని చెప్పిన కేసీఆర్... ప్రాణప్రదమైన నీటిని తాకట్టు పెట్టారని సీఎం ఆరోపించారు. 2016లో జరిగిన ఎపెక్స్ కమిటీ సమావేశంలో గోదావరి నీటిని ఎలా వినియోగించుకోవాలన్న అంశాన్ని కేసీఆర్ లేవనెత్తడంతో చంద్రబాబు మనసులో ఆలోచన వచ్చి బనకచర్ల ప్రాజెక్టుకు పునాది పడిందన్నారు. చంద్రబాబు పాత యజమాని కావడంతో అప్పట్లో కేసీఆర్ భయపడి ఉండొచ్చని, జగన్ సీఎంగా వచ్చిన తరువాత కూడా 2020లో గట్టిగా మాట్లాడలేదని విమర్శించారు. తీర్పు రావడానికి ఇంకా ఎన్నేళ్లు పడుతుందో తెలియని పరిస్థితుల్లో రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టారని అన్నారు.
Details
తెలంగాణకు 71 శాతం, ఏపీకి 29 శాతం రావాలి
అంతర్జాతీయ జలవిధానం ప్రకారం పరీవాహక ప్రాంతం ఆధారంగా నీటి కేటాయింపులు జరగాలని, ఆ లెక్కన తెలంగాణకు 71 శాతం, ఏపీకి 29 శాతం రావాలని సీఎం వివరించారు. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీల్లో తెలంగాణకు 555 టీఎంసీలు రావాలని, నీటి లభ్యతను 1005 టీఎంసీలుగా పరిగణిస్తే 763 టీఎంసీలు రావాలని చెప్పారు. ఈ వాదనను ఎపెక్స్ కౌన్సిల్ వద్ద కేసీఆర్ ఎందుకు వినిపించలేదని ప్రశ్నించారు. ఇప్పుడు మాత్రం తెలంగాణ హక్కులను తామే తాకట్టు పెట్టామని కేంద్రం వద్ద, ఎపెక్స్ కౌన్సిల్ వద్ద అబద్ధ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నిజాలు బయటకు రాకముందే అబద్ధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కుట్ర పన్నారని విమర్శించారు.
Details
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నేపథ్యం
ఉమ్మడి రాష్ట్రంలో రోజుకు 4.47 టీఎంసీలు దోచుకున్న ఏపీ... కేసీఆర్ హయాంలో రోజుకు 13.17 టీఎంసీలు తీసుకెళ్లేలా అవకాశం కల్పించారని ఆరోపించారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల కోసం ప్రాజెక్టు అవసరమని తొలిసారిగా మాజీ ఎంపీ విఠల్‌రావు ప్రతిపాదించారని సీఎం తెలిపారు. ప్రాజెక్టుకు పేరు పెట్టాలంటే ఆయన పేరే పెట్టాలని అన్నారు. ఈ ప్రాజెక్టు సకాలంలో పూర్తయితే రూ.85 వేల కోట్లు ఖర్చవుతాయని, ఆలస్యమైతే రూ.లక్ష కోట్లకు చేరుతుందని చెప్పారు. 2022 వరకు అంచనాలే సిద్ధం చేయకుండా ఏడేళ్ల పాటు రూ.20 వేల కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు. ఏఐబీపీ కింద చేర్చితే 90 శాతం కేంద్ర నిధులు వచ్చేవని, పోలవరం తరహాలో రాష్ట్రానికి మద్దతు లభించే అవకాశం ఉండేదని అన్నారు.
Details
90 టీఎంసీలకు గత ప్రభుత్వం అనుమతులు కోరింది
''ఈ వడ్డీరేటుకు జూదం ఆడేవాడు కూడా అప్పు తీసుకోడని వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తక్కువ వడ్డీకి 36 ఏళ్ల కాలపరిమితికి ఆ రుణాలను పునర్‌వ్యవస్థీకరించామని తెలిపారు. మైనర్ ఇరిగేషన్‌లో పొదుపు ద్వారా 45 టీఎంసీలు, పోలవరం నుంచి కృష్ణాకు మళ్లించే గోదావరి జలాల్లో ఎగువ రాష్ట్రాలు వినియోగించుకోని 45 టీఎంసీలు కలిపి 90 టీఎంసీలకు గత ప్రభుత్వం అనుమతులు కోరిందని చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా 150 టీఎంసీలు వినియోగిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం సీడబ్ల్యూసీకి వివరాలు ఇచ్చిన నేపథ్యంలో 90 టీఎంసీలకు అనుమతులు ఎలా వస్తాయని ప్రశ్నించారు.
Details
కేంద్రానికి తీర్మానం… సభ ఆమోదం
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం ప్రవేశపెట్టారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా తీవ్రమైన కరవు ప్రాంతమని, అత్యంత వెనుకబడిన ప్రాంతమని ఆయన వివరించారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు 90 టీఎంసీలతో సాగు, తాగునీటి అవసరాల కోసం అన్ని అనుమతులు సత్వరమే ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాలు పరిష్కారమయ్యే వరకు పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు, పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టు లేదా ఇతర రూపాల్లో గోదావరి జలాలను తరలించేందుకు ఎలాంటి అనుమతులు ఇవ్వరాదని కేంద్రాన్ని కోరింది. అనంతరం ప్రైవేటు యూనివర్సిటీ సవరణ బిల్లును మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రవేశపెట్టారు.