Mamata Banerjee: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అందుకే ఓడిపోయింది: మమతా బెనర్జీ
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయిందో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. విపక్ష 'ఇండియా' కూటమిలోని భాగస్వామ్య పక్షాలతో సీట్ల పంపకాల ఒప్పందం లేకపోవడం వల్లనే మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని మమతా అన్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో సోమవారం ఆమె ప్రసంగించారు. ఇది కాంగ్రెస్ ఓటమి మాత్రమే అని, ప్రజలది కాదని అన్నారు. ఆ మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలడం వల్లే బీజేపీ గెలిచిందన్నారు. ఎన్నికల్లో గెలవడానికి భావజాలంతో పాటు వ్యూహం కూడా అవసరమని మమతా అన్నారు. సీట్ల పంపకం విధానం ఉంటే.. 2024లో బీజేపీ అధికారంలోకి రాదన్నారు.
తప్పులను సరిదిద్దుకుంటాం: మమతా
వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలలోపు ప్రతిపక్ష పార్టీల కూటమి కలిసికట్టుగా పనిచేసి తప్పులను సరిదిద్దుకుంటామని మమత్ స్పష్టం చేశారు. మిజోరంలో మొత్తం 40 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్నట్లు మమతా బెనర్జీ పేర్కొన్నారు. మరికొన్ని కూటమిలోని పార్టీలు కూడా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించాయి. చాలా మిత్రపక్షాలను ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను దూరం పెట్టిందని విమర్శించారు. కూటమిలోని ఇతర పార్టీలను కాంగ్రెస్ పట్టించుకోలేదని, అలాగే సొంతంగా గెలవలేకపోయిందని జనతాదళ్-యునైటెడ్‌కు చెందిన కెసి త్యాగి అన్నారు.