Supreme Court:'ఇదే మీకు చివరి అవకాశం'.. రాష్ట్రాలకు సుప్రీం కోర్టు చివరి హెచ్చరిక
రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆలస్యం చేస్తుండటంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న వలస కార్మికులకు రేషన్ కార్డులు అందకుండా జాప్యం జరుగుతున్నందుకు కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను పాటించేందుకు మీకు చివరి అవకాశం ఇస్తున్నామని, లేదంటే మీ కార్యదర్శులను కోర్టుకు రావాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది. సుప్రీంకోర్టు 2020లో కోవిడ్ సమయంలో వలస కార్మికులు ఎదుర్కొన్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని ఈ అంశంపై సుమోటో విచారణ ప్రారంభించింది.
వలస కార్మికులకు రేషన్ కార్డులు జారీ చేయాలి
2021లో న్యాయస్థానం, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ చట్టం కింద కేటాయింపులకు సంబంధం లేకుండా, ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న సుమారు 8 కోట్ల వలస కార్మికులకు రేషన్ కార్డులు జారీ చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు కొన్నిచోట్ల మాత్రమే ఈ ప్రక్రియ పూర్తి కాగా, మిగతా రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు జాప్యం చేస్తున్నాయి. కోర్టు మరోసారి నవంబర్ 19లోగా ఈ అంశంపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి వర్గాలను, రాష్ట్రాలకు ఆదేశాలను జారీ చేసింది.