'Zorawar' Light Tank: 'లైట్ ట్యాంక్'ను సిద్ధం చేసిన భారత్.. చైనా సరిహద్దులో మోహరింపుకు రంగం సిద్ధం
భారత సైన్యం అమ్మలపొదిలో మరో అధునాతన ఆయుధం చేరబోతుంది. రక్షణ రంగంలో భారత్ మరో మైలురాయిని అందుకుంది. దేశీయంగా అభివృద్ధి చేసిన 'లైట్ ట్యాంక్'ను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) సిద్ధం చేసింది. దీనికి 'జొరావర్' అని పేరు పెట్టింది. ఈ నెలాఖరు నాటికి లైట్ ట్యాంక్ ట్రయల్స్‌కు సిద్ధంగా ఉన్నట్లు ఎకనామిక్ టైమ్స్‌లోని ఒక నివేదిక పేర్కొంది. 2020లో భారత్, చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు తలెత్తిన సమయంలో ఎత్తైన ప్రదేశాలలో తేలికపాటి ట్యాంకులను మోహరించాలని భారత సైన్యం నిర్ణయించింది. 25 టన్నుల బరువుతో తేలికైన ట్యాంకుల అవసరమని భారత్ భావించింది. చైనా సరిహద్దులో మోహరించేందుకులైట్ ట్యాంకు తయారీ కోసం ఏప్రిల్ 2022లో కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
లైట్ ట్యాంక్‌లు చైనా ట్యాంకుల కంటే చాలా రెట్లు బెటర్
డీఆర్‌డీఓ తయారు చేసిన 105 ఎంఎం గన్‌తో కూడిన ఈ లైట్ ట్యాంక్ అత్యంత అధునాతనమైనది. ఇది లద్ధాఖ్‌లో మోహరించిన చైనా టైప్ 15 ట్యాంకుల కంటే ఇది చాలా రెట్లు మెరుగైనది. ఈ లైట్ ట్యాంక్‌లను చైనీస్ ట్యాంకుల కంటే వేగంగా ఒక చోటు నుంచి మరొక చోటుకు తరలించవచ్చు. లైట్ ట్యాంక్ డిజైన్ అనేది పూర్తిగా కొత్తది అని చెప్పాలి. ఇది ప్రత్యేకమైన ఛాసిస్‌తో తయారు చేసారు. దీనికి జాన్ క్రోకెరిల్ తయారు చేసిన 105 ఎంఎం గన్‌ని అమర్చారు. జోరావర్ ట్యాంకులు దాడులను నివారించడానికి క్రియాశీల రక్షణను కలిగి ఉంటుంది. ఈ ట్యాంక్ ఎత్తైన ప్రదేశాల్లోనే కాకుండా అన్ని రకాల భూభాగాల్లో పనిచేసేలా దీన్ని తయారు చేసారు.