
Cyber Attack: పాక్ హ్యాకర్ల ముప్పు.. భారత్‌లో సైబర్ అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిపోయాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాలు దౌత్య పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటుండగా, పాక్ హ్యాకర్ల నుంచి సైబర్ ముప్పు పొంచి ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి.
దీంతో భారత ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైంది. పాకిస్థాన్ ఆధారిత హ్యాకర్లు పహల్గాం ఘటన తర్వాత భారత్‌ను లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించారని సమాచారం.
ముఖ్యంగా ఆర్మీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వెబ్‌సైట్‌పై హ్యాకింగ్ దాడికి పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం సైబర్ భద్రతను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు ప్రారంభించింది.
Details
సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలను కట్టుదిట్టం చేసుకోవాలి
అన్ని మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు తమ సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలను కట్టుదిట్టం చేసుకోవాలని సూచిస్తూ అలర్ట్ జారీ చేసింది.
అనధికార యాక్సెస్, డేటా లీకులను అడ్డుకునేందుకు సైబర్ హైజీన్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SoPs) పాటించాలని, మరింత బలమైన భద్రతా చర్యలు అమలు చేయాలని ఆదేశించింది.
గతంలోనూ పాక్ హ్యాకర్లు జీ20 సమావేశాలకు సంబంధించి వెబ్‌సైట్లను టార్గెట్ చేసిన ఉదంతాన్ని గుర్తు చేస్తూ, తాజాగా పహల్గాం దాడి జరిగిన కొద్దిసేపటికే సైబర్ దాడికి పాల్పడ్డారని నిఘా వర్గాలు వెల్లడించాయి.
ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) ఆధ్వర్యంలో ఈ దాడులపై ఒక అంతర్గత నివేదిక సిద్ధమవుతోంది.
Details
మౌలిక సదుపాయాల వ్యవస్థలను అస్థిరపరిచే కుట్ర
ప్రస్తుతం ఈ హ్యాకింగ్‌ను కేవలం సైబర్ నేరంగా కాకుండా దేశ భద్రతను కుదిపేయాలనే యుద్ధ వ్యూహంగా భారత అధికారులు భావిస్తున్నారు.
శుక్రవారం హ్యాకర్ల దాడిలో ఆర్మీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వెబ్‌సైట్‌పై రెచ్చగొట్టే సందేశాలు, పహల్గాం ఘటనకు సంబంధించిన చిత్రాలు, ఉగ్రవాదుల ఫొటోలతో కూడిన అసభ్య మెసేజులు కనిపించాయని అధికారులు తెలిపారు.
ఈ దాడుల వెనుక మౌలిక సదుపాయాల వ్యవస్థలను అస్థిరపరిచే కుట్ర ఉన్నదని నిఘా వర్గాలు హెచ్చరించాయి.
ప్రస్తుతం సైబర్ నెట్‌వర్క్‌ను గుర్తించి దర్యాప్తు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ఇది కేవలం సైబర్ ముప్పే కాకుండా భారత్‌పై పాక్ పన్నిన వ్యూహాత్మక దాడిగా భావిస్తున్నారు.