Khalistani threat: భారత్-ఆస్ట్రేలియా ప్రపంచకప్ ఫైనల్‌కు 'ఖలిస్థానీ' గ్రూప్ బెదిరింపులు
అహ్మదాబాద్‌లో ఆదివారం భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ను జరగనివ్వబోమని ఖలిస్థానీ గ్రూప్ హెచ్చరించింది. ఈ మేరకు ఖలిస్థానీ ఉగ్రవాది, 'సిక్కులు ఫర్ జస్టిస్' వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ బెదిరింపు వీడియోను విడుదల చేశాడు. ఈ వీడియోలలో 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లు, 2002 నాటి గుజరాత్ అల్లర్ల గురించి పన్నూన్ మాట్లాడాడు. ఈ వీడియో ద్వారా ముస్లిం, క్రైస్తవ వర్గాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినట్లు స్పష్టమవుతోంది. పన్నూన్ బెదిరింపు వీడియోను విడుదల చేయడం ఇది మొదటిసారి కాదు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం విషయంలో భారతదేశం వైఖరిని ఖలిస్థానీ ఉగ్రవాదులు చాలాసార్లు వ్యతిరేకిస్తూ వీడియోను రిలీజ్ చేశాడు.
ఇజ్రాయెల్, పాలస్తీనా లాంటి యుద్ధమే భారత్‌లో జరుగుతుంది: పన్నూన్
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధం నుంచి ప్రధాని మోదీ పాఠాలు నేర్చుకోవాలని అక్టోబర్‌లో పన్నూన్ మొదటిసారి బెదిరింపు విడుదల చేశాడు. భారతదేశంలో కూడా ఇలాంటి యుద్ధం జరగవచ్చన్నాడు. పాలస్తీనా నుంచి పంజాబ్ వరకు ఎక్కడ అక్రమ ఆక్రమణలు జరిగినా అక్కడి ప్రజలు తిరుగుబాటుదారులుగా మారతారని పన్నూన్ అన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో సెప్టెంబరు నెలలో భారత్‌లో పన్నూన్‌పై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైంది. కెనడాలోని ఖలిస్తానీ ఉగ్రవాదులకు జస్టిన్ ట్రూడో ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో ఖలిస్తానీ ఉగ్రవాదులకు అక్కడి ప్రభుత్వం మినహాయింపునిస్తుంది. ఈ విషయమై కెనడాతో భారత్ పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఐరాసలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తింది. అయినా ఫలితం లేకుండా పోయింది.