Page Loader
Kauhik Reddy: చంపుతామని బెదిరింపులు.. హుజురాబాద్‌ ఎమ్మెల్యేపై నాన్ బెయిలబుల్ కేసు!
చంపుతామని బెదిరింపులు.. హుజురాబాద్‌ ఎమ్మెల్యేపై నాన్ బెయిలబుల్ కేసు!

Kauhik Reddy: చంపుతామని బెదిరింపులు.. హుజురాబాద్‌ ఎమ్మెల్యేపై నాన్ బెయిలబుల్ కేసు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 23, 2025
10:44 am

ఈ వార్తాకథనం ఏంటి

హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రానైట్‌ క్వారీ యజమానిని బెదిరించారన్న ఆరోపణలపై ఆయనపై నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదైంది. బాధితుల ఫిర్యాదు మేరకు సుబేదారి పోలీసులు ఆయనపై BNS సెక్షన్లు 308(2), 308(4), 352 కింద 225/2025 ఎఫ్ఐఆర్‌ను నమోదు చేశారు. ఇది నాన్‌బెయిలబుల్ కేసు కావడంతో ఎమ్మెల్యేను త్వరలో అరెస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం. నాలుగు రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ జరగనుండగా, పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై ఈ తరహా కేసు నమోదు కావడం పెద్ద దుమారం రేపుతోంది. హనుమకొండ జిల్లా ఎక్సైజ్‌ కాలనీలో నివసించే కట్టా మనోజ్‌ రెడ్డి అనే వ్యక్తి కమలాపూర్ మండలం వంగపల్లి శివారులో గ్రానైట్‌ క్వారీ నడుపుతున్నారు.

Details

సుబేదారి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు

ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం పాడి కౌశిక్‌ రెడ్డి, మనోజ్‌ రెడ్డిపై మొదట రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు ఆరోపణలు వెలువడ్డాయి. డబ్బులు ఇవ్వకపోతే క్వారీ నిర్వహించనివ్వరని బెదిరించడంతో భయంతో మనోజ్‌ రెడ్డి డబ్బులు చెల్లించాడు. అయితే ఈ నెల 18న ఆయన మళ్లీ ఫోన్‌ చేసి ఈసారి రూ.50 లక్షలు డిమాండ్ చేసినట్టు, డబ్బులు ఇవ్వకపోతే తన కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించినట్టు బాధితుడు తెలిపాడు. ఈ బెదిరింపులతో మనోజ్‌ రెడ్డి మానసికంగా తీవ్రంగా ఆవేదన చెందుతుండగా, విషయం తెలుసుకున్న అతని భార్య కట్టా ఉమాదేవి సుబేదారి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ప్రకారం తమకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ, కౌశిక్‌ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.