High Court: ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా ముగ్గురు ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా కుంచం మహేశ్వరరావు, తూట చంద్ర ధనశేఖర్, చల్లా గుణరంజన్ ప్రమాణ స్వీకారం చేశారు. సో మవారం హైకోర్టులోని మొదటి కోర్టు హాలులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్ నూతన న్యాయమూర్తులతో ప్రమాణం చేయించారు. ఈ నియామకంతో ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరుకుంది. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వై.లక్ష్మణరావు కొత్తగా నియమితులైన న్యాయమూర్తుల నియామక ఉత్తర్వులను చదివి వినిపించారు. న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార వేడుకకు హైకోర్టు న్యాయమూర్తులు, విశ్రాంత న్యాయమూర్తులు, న్యాయవాదులు, ప్రభుత్వం తరఫు అధికారులు, నూతన న్యాయమూర్తుల కుటుంబసభ్యులు హాజరయ్యారు.
జస్టిస్ కుంచం మహేశ్వరరావు
తిరుపతికి చెందిన జస్టిస్ మహేశ్వరరావు 1998లో న్యాయవాదిగా ప్రవేశించారు. సీనియర్ న్యాయవాది వేదుల శ్రీనివాస్ వద్ద శిక్షణ పొందిన అనంతరం సొంతంగా ప్రాక్టీసు ప్రారంభించారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ సంబంధ కేసులలో ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉన్నారు. జస్టిస్ తూట చంద్ర ధనశేఖర్ నెల్లూరులో న్యాయ విద్యాభ్యాసం చేసిన ధనశేఖర్ 1999లో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. ప్రభుత్వ న్యాయవాదిగా పని చేసి, ట్యాక్స్, రెవెన్యూ, భూసేకరణ వంటి పలు అంశాల్లో విశేష అనుభవం సాధించారు. జస్టిస్ చల్లా గుణరంజన్ అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన గుణరంజన్ సుప్రీంకోర్టు, హైకోర్టు, వివిధ ట్రైబ్యునల్‌లలో ప్రాక్టీసు చేస్తున్నారు. విద్యుత్, పర్యావరణ, పన్ను చట్టాలపై అనుభవం కలిగి పలు సంస్థలకు న్యాయ సలహాదారుగా సేవలందిస్తున్నారు.