Telangana: నేటి నుంచి తెలంగాణలో మూడు రోజుల వర్షాలు.. వాతావరణశాఖ కీలక హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. రాబోయే నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్,మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మీదుగా మరింత విస్తరించే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. వాతావరణ శాఖ వివరాల ప్రకారం, బంగాళాఖాతం మధ్య ప్రాంతం నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అలాగే ఉత్తర్‌ప్రదేశ్ నుంచి విదర్భ ప్రాంతం వరకు సుమారు 900 మీటర్ల ఎత్తులో మరో ఉపరితల ద్రోణి ఏర్పడింది.
వివరాలు
ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు
ఈ రెండు వాతావరణ వ్యవస్థల ప్రభావంతో గురువారం నుంచి వరుసగా మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు నమోదయ్యాయి. బుధవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అనేక ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షపాతం కురిసింది. అలాగే మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు హైదరాబాద్ నగరంలోని హిమాయత్‌నగర్‌లో 7 సెంటీమీటర్లు, గచ్చిబౌలిలో 5 సెంటీమీటర్లు, గోల్కొండలో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.