Bomb Threats: ఢిల్లీ స్కూళ్లకు మళ్ళీ బాంబు బెదిరింపు.. వారంలో రెండోసారి..!
దేశ రాజధాని దిల్లీలో మరోసారి పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలవరం సృష్టించింది. పశ్చిమ విహార్‌లో ఉన్న దిల్లీ పబ్లిక్ స్కూల్, కేంబ్రిడ్జ్ పాఠశాల సహా పలు విద్యాసంస్థలకు శుక్రవారం తెల్లవారుజామున ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు అందాయి. ఈ విషయాన్ని గమనించిన యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. దిల్లీ పోలీసులు అగ్నిమాపక సిబ్బంది,బాంబు నిర్వీర్య దళాన్ని వెంటనే ఘటనాస్థలానికి పంపించి తనిఖీలు ప్రారంభించారు. ఇప్పటివరకు ఎటువంటి పేలుడు పదార్థాలు కనిపించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ మెయిల్ ఎక్కడి నుంచి పంపించబడిందన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రత్యేకంగా మెయిల్‌లో ఉన్న ఐపీ అడ్రస్ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
40కి పైగా పాఠశాలలకు ఇలాంటి బెదిరింపు మెయిల్స్
ఇదిలా ఉంటే, పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులు రావడం వారంలో ఇది రెండోసారి కావడం గమనార్హం. డిసెంబరు 9న కూడా దిల్లీలో 40కి పైగా పాఠశాలలకు ఇలాంటి బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. పాఠశాల ఆవరణల్లో పేలుడు పదార్థాలు అమర్చామని, వాటిని నిర్వీర్యం చేయకుండా 30వేల డాలర్లు ఇవ్వాలని అగంతకులు బెదిరించారు. అయితే, అది నకిలీదని ఆ తర్వాత జరిగిన ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఏడాది ఆరంభం నుంచి దిల్లీ సహా పలు ప్రాంతాల్లో పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులు నమోదవుతున్నాయి. అంతేకాక, అక్టోబరులో రోహిణి ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ పాఠశాల వద్ద జరిగిన బాంబు పేలుడు తీవ్ర కలకలం రేపింది.