Pre Launch Offer Real Estate Scam: ప్రీ-లాంచ్ ఆఫర్ పేరుతో 350 మంది నుంచి రూ.80 కోట్లకు పైగా వసూళ్లు
ప్రీ-లాంచ్ ఆఫర్ పేరుతో హైదరాబాద్‌లో మోసాలు యదేచ్ఛగా జరుగుతున్నాయి. సాహితీ ఇన్ ఫ్రా, ఎలన్ వంటి తదితర కంపెనీలు ప్రీ-లాంచ్ పేరుతో మోసాలు వెలుగులోకి వచ్చినా అమాయకపు ప్రజలు ఇంకా వంచనకు గురి అవుతున్నారు. వీటిపై న్యాయస్ధానం జోక్యం చేసుకుని కొందరు బాధితులకు ఊరట కలిగించిన సంగతి తెలిసిందే. ఇలాంటి మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది.
మరో ప్రీ-లాంచ్ ఆఫర్ మోసం
ఈ సారి భారతీ లేక్‌వ్యూ పేరుతో భారీ మోసానికి పాల్పడ్డారు. ఈ వ్యవహారంలో భారతీ బిల్డర్స్ చైర్మన్ దూపాటి నాగరాజు, ఎండీ శివరామకృష్ణ, సీఈఓ నరసింహరావులను అరెస్టులు అరెస్టు చేశారు. కొంపల్లిలో భారతీ లేక్‌వ్యూ ప్రీ-లాంచ్ పేరుతో భారీగా వసూళ్లు చేసినట్లు గుర్తించారు. అతి తక్కువ ధరకు ఫ్లాట్స్ అంటూ 350 మంది నుంచి రూ.80 కోట్ల వరకు వసూళ్లు చేసినట్లు గుర్తించారు. డబ్బులు వసూలు చేసినా నిర్మాణం చేపట్టలేదు. దీంతో బాధితులు పోలీసులు ఆశ్రయించగా.. కేసు నమోదు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కొంపల్లిలోని భారతి లేక్ వ్యూ పేరుతో ఓ ప్రాజెక్టును చేపట్టారు. ప్రీ-లాంచ్ ఆఫర్ అంటూ అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేశారు.
చదరపు అడుగు రూ. 3,200కే..
6.23 ఎకరాల్లో తమ సంస్థ నిర్మాణం చేపడుతుందని చెప్పారు.చదరపు అడుగు రూ. 3,200కే అంటూ ఆకర్షణీయమైన ధరతో ఫ్లాట్‌లను ప్రచారం చేశారు. రంగురంగుల బ్రోచర్‌లను పంపిణీ చేశారు. కొంపల్లిలోని వెంచర్ సైట్‌తో పాటు మాదాపూర్‌లోని ఆఫీసుల్లో కస్టమర్లతో సమావేశాలు నిర్వహించి వారిని నమ్మించారు. రంగురంగుల బ్రోచర్‌లను చూసి మోసపోయినంత కాలం ఇలాంటి కేటుగాళ్ల నుంచి ఏ రేరా చట్టం ప్రజలను కాపాడలేదు. అప్రమత్తంగా ఉండటమే దీనికి పరిష్కారం.