
Andhra Pradesh: గ్రామాలకూ నిరంతర త్రీఫేజ్ విద్యుత్.. ఆర్డీఎస్‌ఎస్ కింద ఫీడర్ల విభజన,రూ.851 కోట్ల ఆదా
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీలోని ప్రతి గ్రామానికి త్రీఫేజ్ ద్వారా నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందుకోసం విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు)పంపిణీ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ పథకం (ఆర్డీఎస్‌ఎస్)కింద ఫీడర్ల విభజన,కొత్త ఫీడర్ల ఏర్పాటు వంటి పనులు ప్రారంభించాయి. ఈ చర్యల వల్ల సాంకేతిక నష్టాలు 9.9% వరకు తగ్గుతాయని, అలాగే ప్రతి సంవత్సరం విద్యుత్ కొనుగోలు వ్యయంలో సుమారు రూ.851 కోట్లు ఆదా అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఒక్క కి.మీ. ఫీడర్ విభజన పనులు, అదనపు ట్రాన్స్‌ఫార్మర్‌ల ఏర్పాటు ద్వారా యూనిట్‌కు సగటున 4 పైసల వరకు విద్యుత్ వ్యయం తగ్గుతుందని లెక్కగట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ సంస్థలు మొత్తం 77,646 మిలియన్ యూనిట్లు (ఎంయూ) విక్రయించినట్లు సమాచారం.
వివరాలు
5,783 ఫీడర్ల విభజన పనులు
మూడు డిస్కంల పరిధిలో, వ్యవసాయ విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేక ఫీడర్లను ఏర్పాటు చేస్తూనే, అధిక లోడ్ ఉన్నవాటిని విభజించడం జరుగుతోంది. ఈ క్రమంలో మొత్తం 5,783 ఫీడర్ల విభజన పనులు జరుగుతున్నాయి. దీనివల్ల వ్యవసాయానికి ఆఫ్-పీక్ సమయాల్లో విద్యుత్ అందించి, పీక్ డిమాండ్ సమయంలో వినియోగాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. ఇలా చేస్తే విద్యుత్ కొనుగోలు వ్యయం గణనీయంగా తగ్గుతుంది. ఈ పనుల కోసం డిస్కంలు దాదాపు రూ.10,000 కోట్లకు పైగా పెట్టుబడి పెడుతున్నారు.
వివరాలు
గ్రామాల్లో నిరంతర త్రీఫేజ్ సరఫరా
వ్యవసాయ వినియోగదారులతో పాటు, ఇతర వినియోగదారులకు కూడా విద్యుత్ అందించే 4,845 మిక్స్‌డ్ ఫీడర్లను విడదీస్తున్నారు. దీని ద్వారా గ్రామాల్లో గృహవినియోగదారులు,అలాగే చిన్న పరిశ్రమలకు అంతరాయం లేకుండా త్రీఫేజ్ విద్యుత్ అందేలా చర్యలు తీసుకుంటున్నారు. అదే సమయంలో,11 కేవీ, 33కేవీ ఫీడర్లపై అధిక లోడ్ ఉండడం వల్ల తరచూ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ,సాంకేతిక నష్టాలు పెరుగుతున్నాయి. ఇలాంటివి మొత్తం 938ఫీడర్లు ఉన్నట్లు గుర్తించారు. సమస్య పరిష్కారానికి ఇప్పటివరకు 417ఫీడర్ల విభజన పనులు పూర్తిచేశారు. ఇంకా 173ఫీడర్ల పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. మిగతా 307 చోట్ల పనులు త్వరలో చేపట్టాల్సి ఉంది. ఫీడర్ పరిధిని తగ్గించడం వల్ల, లోడ్ పెరిగిన వెంటనే గుర్తించి అదనపు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది.
వివరాలు
ప్రభుత్వాల దృష్టికోణం
గత వైసీపీ ప్రభుత్వం ఆర్డీఎస్‌ఎస్ పనులకు టెండర్లు పిలిచినా,తర్వాత వాటిని పెద్దగా పట్టించుకోకపోవడంతో మూడు డిస్కంలలో కేవలం 20-30% పనులు మాత్రమే పూర్తయ్యాయి. అయితే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించే దిశగా ఆర్డీఎస్‌ఎస్ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. గుత్తేదారులతో చర్చలు జరిపి, పనులను వేగవంతం చేసింది. ప్రస్తుతం 40-50 శాతం పనులు పూర్తి కాగా, ఈ ఏడాదిలోనే మొత్తం పనులను పూర్తిచేయాలనే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు.