ఢిల్లీ ప్రజలకు హెచ్చరిక.. రానున్న 3-4 రోజుల్లో పిడుగులు పడే అవకాశం
దేశ వ్యాప్తంగా నిన్నటి వరకు భానుడు సెగలు కక్కాడు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో సూర్యుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోయారు. ఉదయం నుంచే బయటకు రావాలంటే ప్రజలు భయపడ్డారు. అలాంటి ఢిల్లీలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. నగరంలో సోమవారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. సోనిపట్, రోహ్‌తక్, ఘజియాబాద్, నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్, హిండన్ ఏఎఫ్ స్టేషన్, ఇందిరాపురం, జింద్, గోహనా పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. ఇక ఆదివారం రికార్డు స్థాయిలో 35.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఉక్కబోతతో అల్లాడిపోయారు.
తీవ్ర ఇబ్బందులకు గురైన వాహనదారులు
ఆదివారం రాత్రి నుంచి ఉదయం వరకు కురిసిన వర్షంతో ఢిల్లీ-ఎన్ పీఆర్ ప్రాంతంలో ఉష్ణోగ్రత్తలు తగ్గుముఖం పట్టాయి. ఇక వచ్చే మూడు, నాలుగు రోజుల పాటు ఢిల్లీలో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. హర్యానాతో పాటు ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతంలో మోస్తారు వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈదురుగాలులకు నగరంలో అక్కడక్కడ రోడ్లపై చెట్లు విరిగిపడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం నుంచి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడటంతో ప్రజలకు ఇక్కట్లు తప్పలేదు.