'తెలంగాణ నిర్మాణ పార్టీ' పేరుతో తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీ
తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భావానికి సమయం ఆసన్నమైంది. జైలు నుంచి విడుదలైన జర్నలిస్టు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ మంగళవారం కీలక ప్రకటన చేశారు. 'తెలంగాణ నిర్మాణ పార్టీ' పేరుతో కొత్త రాజకీయ వేదికను స్థాపిస్తున్నట్లు మల్లన్న ప్రకటించారు. చర్లపల్లి జైలు ఎదుట మంగళవారం రాత్రి తీన్మార్ మల్లన్న పార్టీ పేరును ప్రకటించారు. 'తెలంగాణ నిర్మాణ పార్టీ' పేరుతో కేసీఆర్‌ను గద్దె దించేందుకు కృషి చేస్తామన్నారు. తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీ ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
నన్ను ఎదుర్కోలేక తప్పుడు కేసులు పెట్టారు: మల్లన్న
బడుగు బలహీన వర్గాల పక్షాన తాను పారాడుతానని తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. మరో నాలుగు నెలల్లో తెలంగాణలో కేసీఆర్ పేరు వినిపించదని మల్లన్న అన్నారు. జైలు నుంచి విడుదలైన తీన్మార్ మల్లన్నకు క్యూ న్యూస్ సిబ్బంది, ఆయన అనుచరులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసులపై ఆధారపడి తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని విమర్శించారు. తనను ఎదుర్కోలేక తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారని తీన్మార్ మల్లన్నను ఆరోపించారు. తనను జైల్లో పెట్టిన కేసీఆర్‌కు నెలరోజుల్లో వడ్డీ మొత్తం తిరిగి చెల్లిస్తానన్న ఆయన, తీన్మార్ మల్లన్నకు జైలు కొత్త కాదని స్పష్టం చేశారు.