Page Loader
శ్రీవారి ఆలయ ముఖద్వారం వద్ద జారిపడ్డ హుండీ.. బయటకు వచ్చిన కానుకలు
బయటకు వచ్చిన కానుకలు

శ్రీవారి ఆలయ ముఖద్వారం వద్ద జారిపడ్డ హుండీ.. బయటకు వచ్చిన కానుకలు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 06, 2023
03:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. ఈ మేరకు ఆలయ ముఖద్వారం వద్ద సీల్ వేసిన హుండీ పొరపాటున జారికింద పడిపోయింది. సాధారణంగా శ్రీవారి సన్నిధిలో భక్తులు సమర్పించే కానుకలను హుండీ నిండాక ఆలయం వెలుపలికి తీసుకువస్తారు. అనంతరం లారీ ద్వారా నూతన పరకామణికి తరలిస్తారు. ఇందులో భాగంగానే హుండీని పరకామణికి తీసుకెళ్లేందుకు ఆలయం బయట ఓ ట్రాలీలోకి ఎక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖద్వారం వద్ద హుండీ జారి కిందపడింది. ఈ సందర్భంగా హుండిలోని నగదు కొంత మేర బయటకు వచ్చింది. అప్రమత్తమైన టిటిడి సిబ్బంది వెంటనే హుండీని లారీలోకి జాగ్రత్తగా ఎక్కించారు.

DETAILS

సిబ్బంది నిర్లక్ష్యంపై మండిపడుతున్న భక్తజనం

సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. శ్రీవారి హుండీని ఆలయం నుంచి పరకామణి మండపానికి తరలిస్తున్న క్రమంలో మహాద్వారం దగ్గర హుండీ కిందపడిపోయింది. ఆ సమయంలో హుండీలో నుంచి కానుకలు కిందపడ్డాయి. ఆ తర్వాత కింద పడిపోయిన కానుకలను సేకరించిన టిటిడి సిబ్బంది వాటిని ఆలయ అధికారులకు అప్పగించారు. మరోవైపు ఎంతో భక్తితో కళ్లకు అద్దుకుని తిరుమల శ్రీవారికి సమర్పించిన కానుకలు నేలపాలు కావడంతో భక్తజనం ఆవేదన చెందుతున్నారు. ఈ మేరకు సిబ్బంది నిర్లక్ష్యంపై భక్తులు మండిపడుతున్నారు. కానుకల హుండీ నేలపై పడటంతో ఆలయంలో అపచారం జరిగిందని భావిస్తున్నారు.