LOADING...
Cm chandrababu: తిరుపతి-రేణిగుంట పారిశ్రామిక హబ్‌తో రైల్వే అనుసంధానం.. రైల్వే ప్రాజెక్టులపై సమీక్షలో సీఎం చంద్రబాబు
రైల్వే ప్రాజెక్టులపై సమీక్షలో సీఎం చంద్రబాబు

Cm chandrababu: తిరుపతి-రేణిగుంట పారిశ్రామిక హబ్‌తో రైల్వే అనుసంధానం.. రైల్వే ప్రాజెక్టులపై సమీక్షలో సీఎం చంద్రబాబు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 29, 2026
11:39 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ,ఛత్తీస్‌గఢ్‌,మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పోర్టులకు సరుకు రవాణా మరింత సులభంగా జరిగేలా రైల్వే సదుపాయాలు కల్పించే దిశగా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు, ఫిషింగ్‌ హార్బర్‌ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో, వాటన్నింటినీ ప్రధాన రైల్వే మార్గాలతో అనుసంధానించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. బుధవారం రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడుతూ, ఏపీ లాజిస్టిక్స్‌ వ్యవస్థను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని, రైల్వే రంగంలో రాష్ట్రాన్ని బెంచ్‌మార్క్‌గా నిలపాలని సూచించారు.

వివరాలు 

ఇచ్ఛాపురం-తడ మధ్య నాలుగు రైల్వే లైన్లు

రాష్ట్రంలో ఏటా ఉత్పత్తి అవుతున్న సుమారు 225లక్షల మెట్రిక్‌ టన్నుల ఉద్యానవన ఉత్పత్తులను దేశవ్యాప్తంగా వివిధ మార్కెట్లకు చేరవేసేలా రైల్వే కనెక్టివిటీని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. తిరుపతి-రేణిగుంట ప్రాంతం వేగంగా పారిశ్రామిక కేంద్రంగా మారుతున్న నేపథ్యంలో, ఈ మార్గాన్ని ప్రధాన రైల్వే లైన్లతో అనుసంధానిస్తే పరిశ్రమల ఉత్పత్తులు తక్కువ వ్యయంతో,తక్కువ సమయంలో రవాణా చేయవచ్చని సీఎం తెలిపారు. కోల్‌కతా-చెన్నై ప్రధాన రైల్వే మార్గంలో ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోని ఇచ్ఛాపురం నుంచి తడ వరకు నాలుగు రైల్వే లైన్లు ఉండేలా కార్యాచరణ చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ ప్రాజెక్టు మూడేళ్లలో పూర్తి అయ్యేలా డీపీఆర్‌ సిద్ధం చేయాలని సూచించారు. అవసరమైన భూమిని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.

వివరాలు 

అమరావతితో ప్రధాన నగరాల అనుసంధానం

రైల్వే ప్రాజెక్టుల భూసేకరణ, పర్యవేక్షణ బాధ్యతలను సమర్థంగా నిర్వహించేందుకు పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా డిప్యూటీ కలెక్టర్లను నియమించాలని సీఎం ఆదేశించారు. విజయవాడ, విశాఖపట్నం, గుంతకల్లు, గుంటూరు, రేణిగుంట వంటి కీలక రైల్వే జంక్షన్లలో ట్రాఫిక్‌ రద్దీ తగ్గించే మార్గాలపై దృష్టిపెట్టాలని సీఎం సూచించారు. రాయలసీమ నుంచి కోస్తాంధ్రకు రైల్వే కనెక్టివిటీని మరింత పెంచాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు నిర్మిస్తున్న కొత్త రైల్వే లైన్‌ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై సహా అన్ని ప్రధాన నగరాలను అమరావతి కోర్‌ క్యాపిటల్‌తో కలిపేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సీఎం ఆదేశించారు.

Advertisement

వివరాలు 

పుష్కరాలకు ముందస్తు సన్నాహాలు

విజయవాడ, గుంటూరులో ఉన్న రైల్వే టెర్మినళ్లను విస్తరించడంతో పాటు, అమరావతి మరియు గన్నవరంలలో కొత్త టెర్మినళ్ల నిర్మాణ ప్రతిపాదనలను త్వరగా అమలు చేయాలని సూచించారు. గోదావరి పుష్కరాల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైల్వే శాఖ ఇప్పటి నుంచే ఏర్పాట్లు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. పుష్కరాల నాటికి రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌ను పూర్తిగా ఆధునికీకరించాలని సూచించారు. పుష్కరాల సందర్భంగా 1,012 ప్రత్యేక రైళ్లను నడపడంతో పాటు, 2,370 కోచ్‌లను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వే అధికారులు సీఎంకు వివరించారు. విజయవాడ రైల్వే స్టేషన్‌ను పీపీపీ విధానంలో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం, 2028లో జరిగే కృష్ణా పుష్కరాల నాటికి ఈ పనులు పూర్తయ్యేలా చూడాలని సూచించారు.

Advertisement

వివరాలు 

బెంగళూరు-అమరావతి హైస్పీడ్‌ రైల్‌పై దృష్టి

అమృత్‌ పథకం కింద రాష్ట్రంలో చేపట్టిన 73 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు 2027 నాటికి పూర్తికావాలని, నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్‌ను 2029 మార్చి నాటికి పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే 808 రైల్వే క్రాసింగ్స్‌ వద్ద ఆర్వోబీలు, ఆర్‌యూబీలు నిర్మించాలని సూచించారు. హైదరాబాద్‌-చెన్నై, చెన్నై-బెంగళూరు, హైదరాబాద్‌-బెంగళూరు హైస్పీడ్‌ రైల్‌ కారిడార్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు తెలిపారు. బెంగళూరు నుంచి చిత్తూరు,తిరుపతి మీదుగా అమరావతికి హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గిరిజన ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు రైలు కనెక్టివిటీ పెంచడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.

వివరాలు 

రూ.34,310 కోట్ల రైల్వే ప్రాజెక్టులు

ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి వెయ్యి చదరపు కిలోమీటర్లకు 24.82 కిలోమీటర్ల రైల్వే లైన్లు మాత్రమే ఉన్నాయని, ఇది తమిళనాడుతో పోలిస్తే చాలా తక్కువని సీఎం వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం రూ.34,310 కోట్ల విలువైన 39 రైల్వే ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. వీటి ద్వారా 2,318 కిలోమీటర్ల మేర రైల్వే పనులు జరుగుతున్నాయని తెలిపారు. హైస్పీడ్‌ రైల్వే కారిడార్ల కోసం సర్వే పూర్తి చేసినట్లు, 864 కిలోమీటర్ల పొడవున చేపట్టే ఈ ప్రాజెక్టులకు సుమారు రూ.1.90 లక్షల కోట్ల వ్యయం అవుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే, దక్షిణ కోస్తా రైల్వే డివిజన్ల జనరల్‌ మేనేజర్లు, రాష్ట్ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement