Loading...
Mahua Moitra: మహిళా ఎంపీని రాత్రివేళ బయటకు పంపారు.. అధికారులపై మహువా ప్రివిలేజ్ నోటీసు
మహిళా ఎంపీని రాత్రివేళ బయటకు పంపారు.. అధికారులపై మహువా ప్రివిలేజ్ నోటీసు

Mahua Moitra: మహిళా ఎంపీని రాత్రివేళ బయటకు పంపారు.. అధికారులపై మహువా ప్రివిలేజ్ నోటీసు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 18, 2026
11:46 am

ఈ వార్తాకథనం ఏంటి

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ప్రివిలేజ్ నోటీసు అందజేశారు. పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణనగర్ సర్క్యూట్ గెస్ట్‌హౌస్ నుంచి ఆగస్టు 14వ తేదీ రాత్రి తనను బయటకు పంపించిన ఘటన నేపథ్యంలో ఆమె ఈ నోటీసు ఇచ్చారు. లోక్‌సభ వ్యవహారాల రూల్ 222 ప్రకారం నోటీసు సమర్పించిన మహువా.. నదియా జిల్లా మెజిస్ట్రేట్ శ్రీకాంత్ పల్లి, అదనపు జిల్లా మెజిస్ట్రేట్ నిరుపేంద్ర సింగ్, నజరేత్ డిప్యూటీ కలెక్టర్ అనామికా బేరాల ప్రవర్తనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తన పార్లమెంటరీ విధులకు అధికారులు ఆటంకం కలిగించారని మహువా ఆరోపించారు. ఈ నేపథ్యంలో తనకు స్పీకర్ రక్షణ కల్పించాలని కోరారు.

వివరాలు 

నజరేత్ డిప్యూటీ కలెక్టర్ నుంచి సందేశం

ఆగస్టు 14న సాయంత్రం 6.15 గంటలకు నదియా సర్క్యూట్ హౌస్‌కు చేరుకున్నానని, అక్కడ తనకు గది కేటాయించారని తెలిపారు.

రాత్రి 7 గంటలకు టీ అందించారని,9.20 గంటలకు డిన్నర్ సర్వ్ చేశారని వివరించారు.

అయితే రాత్రి 9.47 గంటలకు నదియా అదనపు జిల్లా మెజిస్ట్రేట్ నుంచి తనకు ఫోన్ వచ్చిందని, వెంటనే గదిని ఖాళీ చేయాలని ఆదేశించినట్లు చెప్పారు.

గదిని ఎందుకు ఖాళీ చేయాలని అడిగినప్పుడు.. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్లు తనకు చెప్పారని మహువా పేర్కొన్నారు.

అనంతరం నజరేత్ డిప్యూటీ కలెక్టర్ నుంచి తనకు ఓ సందేశం కూడా వచ్చినట్లు తెలిపారు.

ఆగస్టు 12వ తేదీనే సర్క్యూట్ హౌస్ అందుబాటులో ఉండదని ఆదేశాలు జారీ చేసినట్లు ఆ మెసేజ్‌లో పేర్కొన్నారని చెప్పారు.

వివరాలు 

సర్క్యూట్ హౌస్ అందుబాటులో ఉండదని ఆగస్టు 12వ తేదీనే ఆదేశాలు

సర్క్యూట్ హౌస్‌లో వార్షిక నిర్వహణ, శుభ్రపరిచే పనులు చేపట్టనున్నట్లు అధికారులు కారణంగా వెల్లడించారని తెలిపారు.

ఆగస్టు 13వ తేదీ కంటే ముందే బుకింగ్ చేసుకున్న వారికి మాత్రం మినహాయింపు ఉంటుందని అధికారులు పేర్కొన్నారని మహువా వివరించారు.

అయితే సర్క్యూట్ హౌస్ అందుబాటులో ఉండదని ఆగస్టు 12వ తేదీనే ఆదేశాలు ఇచ్చినప్పుడు.. ఆగస్టు 14వ తేదీ రాత్రి 10 గంటల వరకు తనను గదిలో ఉండనిచ్చి, ఆ తర్వాత ఎందుకు ఖాళీ చేయించారని ఆమె ప్రశ్నించారు.

ADVERTISEMENT

వివరాలు 

ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకునేలా ప్రివిలేజ్ నోటీసు

మహిళా ఎంపీని రాత్రివేళ గది ఖాళీ చేయాలని ఆదేశించడం తన హక్కులను ఉల్లంఘించడమేనని మహువా తన నోటీసులో పేర్కొన్నారు.

అధికారంలో ఉన్న ప్రభుత్వం మహిళల భద్రత, రక్షణ అంశాలను విస్మరించిందని ఆరోపించారు.

ఈ వ్యవహారంపై ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకునేలా తన ప్రివిలేజ్ నోటీసును ప్రివిలేజ్ కమిటీకి పంపించాలని మహువా మొయిత్రా స్పీకర్ ఓం బిర్లాను కోరారు.

ADVERTISEMENT