LOADING...
Unified District Information System for Education: ఇంటర్‌ పరీక్షల్లో హాజరు కావాలంటే యూడైస్‌లో పేరు తప్పనిసరి!
ఇంటర్‌ పరీక్షల్లో హాజరు కావాలంటే యూడైస్‌లో పేరు తప్పనిసరి!

Unified District Information System for Education: ఇంటర్‌ పరీక్షల్లో హాజరు కావాలంటే యూడైస్‌లో పేరు తప్పనిసరి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 22, 2025
09:36 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇంటర్‌ వార్షిక పరీక్షలు రాయబోతున్నారా? పరీక్ష ఫీజు చెల్లించాలనుకుంటున్నారా? అయితే యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ (యూడైస్‌)లో మీ పేరు తప్పనిసరిగా ఉండాలి. యూడైస్‌లో పేరు లేకపోతే పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతి ఉండదు. అంతేకాక పరీక్ష ఫీజు చెల్లించడానికీ అవకాశం ఉండదు. ఇంటర్‌లో యూడైస్‌ నమోదును అధికారులు కచ్చితంగా తప్పనిసరిచేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షలకుపైగా విద్యార్థులు ఇంటర్‌మీడియట్‌ చదువుతున్నారు. అయితే ఇప్పటివరకు వారిలో కేవలం 75% విద్యార్థుల పేర్లు మాత్రమే యూడైస్‌లో నమోదయ్యాయి. మిగిలిన 25శాతం నమోదులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు కళాశాల ప్రిన్సిపాళ్లపై ఒత్తిడి తెస్తున్నారు.

Details

64% మందే అపార్‌లో నమోదు

మిగతా విద్యార్థుల యూడైస్‌ రిజిస్ట్రేషన్‌ తక్షణమే పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పాఠశాల స్థాయిలో పదో తరగతి విద్యార్థులను యూడైస్‌ సిస్టమ్‌తో అనుసంధానించారు. ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంటర్‌ స్థాయిలో కూడా యూడైస్‌ ఎంట్రీని ప్రారంభించారు. అయితే ఆధార్‌ వివరాల్లో పొరపాట్లు ఉండటం, వాటిని సవరించాల్సి రావడం వంటి కారణాల వల్ల కొంతమంది విద్యార్థుల నమోదులో జాప్యం జరుగుతోందని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అపార్‌ (APAAR) నమోదు స్థాయి కూడా ఆశాజనకంగా లేదని సమాచారం. ఇప్పటివరకు మొత్తం విద్యార్థుల్లో కేవలం 64% మందే అపార్‌లో నమోదు పూర్తిచేశారు.

Details

ఆధార్‌ ఆధారంగా యూడైస్‌లో నమోదు

మిగిలిన 36% విద్యార్థులకు మాత్రమే పెన్‌ నంబర్లు జారీ అయ్యాయి. ఆధార్‌ ఆధారంగా యూడైస్‌లో నమోదవుతారు. ఆ వివరాల ఆధారంగా అపార్‌ ఎంట్రీ జరుగుతుంది, దాని ప్రకారమే పెన్‌ నంబర్‌ కేటాయిస్తారు. ఇటీవల కేంద్ర విద్యాశాఖ కూడా అపార్‌ నమోదును వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. యూడైస్‌, అపార్‌ రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యేంతవరకు పరీక్షల ఫీజు చెల్లింపులు, అడ్మిట్‌ కార్డుల జారీ వంటి ప్రక్రియలు కొనసాగవని స్పష్టంగా పేర్కొన్నారు.