India-France-UAE: 'భారత్-ఫ్రాన్స్- యూఏఈ' త్రైపాక్షిక ప్రణాళిక సహకారం దిశగా మోదీ; ఈనెల 15న అబుదాబికి ప్రధాని
భారత్-ఫ్రాన్స్-యూఏఈ త్రైపాక్షిక ఫ్రేమ్‌వర్క్ కింద రక్షణ, అణుశక్తి, సాంకేతిక రంగాలలో సహకారం కోసం ప్రతిష్టాత్మక రోడ్‌మ్యాప్‌ను ఫ్రిబవరిలో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రణాళికకు పూర్తిస్థాయిలో రూపాన్ని ఇచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మరో ముందడుగు వేయబోతున్నారు. జులై 15వ తేదీన ప్రధాని మోదీ యూఏఈలోని అబుదాబిలో పర్యటించనున్నారు. ఈ నెల 13,14తేదీల్లో ఫ్రాన్స్‌లో తన పర్యటనను పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణంలో మోదీ అబుదాబికి చేరుకుంటారు. జులై 14న ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం సందర్భంగా నిర్వహించే బాస్టిల్ డే పరేడ్‌లో పాల్గొనేందుకు ప్రధాని మోదీని ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ విశిష్ట అతిథిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య కీలక ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరగనున్నాయి.
ఐదోసారి ప్రధాని మోదీ యూఏఈలో పర్యటన
యూఏఈతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేయడానికి ప్రధాని మోదీ అబుదాబిలో అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను కలవనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అబుదాబి పర్యటన ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరుస్తుదనంలో సందేహం లేదు. 2014లో అధికారం చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ యూఏఈలో ఇప్పటి వరకు నాలుగు సార్లు పర్యటించారు. తాజా పర్యటన 5వది అవుతుంది. ఈ పరిణామం ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఇదిలా ఉంటే, సౌదీ నేత, ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ కరీమ్ అల్-ఇస్సాతో ప్రధాని మోదీ మంగళవారం సమావేశమయ్యారు. ఇస్లామిక్ దేశాల్లో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు.
జూన్‌లో మూడు దేశాల ఆధ్వర్యంలో నావికా విన్యాసాలు
భారతదేశం-ఫ్రాన్స్-యూఏఈ మూడు దేశాల మధ్య బలమైన రక్షణ సహకార బంధంలో భాగంగా అబుదాబిలో త్రైపాక్షిక సహకార ప్రణాళికను సంయుక్తంగా ప్రకటించాయి. త్రైపాక్షిక సహకార ప్రణాళిక భాగంగా మూడు దేశాలు జూన్ 7, 2023న గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో మొట్టమొదటి త్రైపాక్షిక నావికా విన్యాసాన్ని నిర్వహించాయి. ఇందులో ఐఎన్ఎస్ తర్కాష్, హెలికాప్టర్లతో ఫ్రెంచ్ నౌక సర్కూఫ్, రాఫెల్ ఫైటర్స్, యూఏఈ నేవీ సముద్ర గస్తీ విమానాలు పాల్గొన్నాయి. వాణిజ్యం, సముద్ర భద్రతతో పాటు నావిగేషన్ స్వేచ్ఛ వంటి ప్రాథమిక లక్ష్యాల కోసం త్రైపాక్షిక ప్రణాళికను ప్రకటించారు. అయితే యూఏఈ పర్యటన గురించి ప్రధానమంత్రి కార్యాలయం ఇంతవరకు స్పందించలేదు.