
నేడు దిల్లీ యూనివర్శిటీలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని కేంద్రం నిషేధించినా దేశంలో ప్రదర్శనలు ఆగడం లేదు. ముఖ్యంగా యూనివర్సిటీల్లో పలు విద్యార్థి సంఘాలు ప్రతిష్టాత్మంగా తీసుకొని ప్రదర్శిస్తున్నాయి. తాజాగా దిల్లీ యూనివర్సిటీలో ఎన్ఎస్‌యూఐ, భీమ్ ఆర్మీ, వామపక్షతో పాటు ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం నార్త్ క్యాంపస్‌లో ప్రదర్శించనున్నట్లు పిలుపునిచ్చారు.
2002లో జరిగిన గుజరాత్ అల్లర్లలో ప్రధాని మోదీ ప్రమేయం ఉందంటూ బీబీసీ 'ఇండియా: ది మోదీ క్వచ్చన్' పేరుతో రెండు ఎపిసోడ్లతో కూడిన డాక్యుమెంటరీని రూపొందించింది. ప్రస్తుతం రెండు ఎపిసోడ్లు విడుదలయ్యాయి. అయితే డాక్యుమెంటరీ వీడియో లింకులపై కేంద్రం నిషేధం విధించింది.
బీబీసీ
డాక్యుమెంటరీ ప్రదర్శనకు అనుమతి లేదు: అధికారులు
బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శనపై దిల్లీ యూనివర్సిటీ అధికారులు స్పందించారు. డాక్యుమెంటరీ ప్రదర్శనకు అనుమతి లేదని, స్క్రీనింగ్‌ను ఆపేందుకు ముందస్తు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఇప్పటికే పలు యూనివర్సిటీల్లో వామపక్ష విద్యార్థి సంఘాలు స్క్రీనింగ్ చేసేందుకు ప్రయత్నించగా అధికారులు అనుమనితి నిరాకరించారు.
జేఎన్‌యూలో అధికారులు ఇంటర్నెట్‌ను నిలిపివేశారు. జామియా మిలియా ఇస్లామియాలో బిబిసి డాక్యుమెంటరీ ప్రదర్శనను నిర్వహించినందుకు 13 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.
2002లో గుజరాత్‌లోని గోద్రా రైల్వే స్టేషన్ సమీపంలో ఒక వర్గం రైలును తగలబెట్టి, 59 మంది హిందూ యాత్రికులను సజీవ దహనం చేశారు. అనంతరం గుజరాత్‌లో మతపరమైన అల్లర్లు చెలరేగగా, అప్పుడు ముఖ్యమంత్రిగా మోదీ ఉన్నారు. ఈ మారణహోమంలో అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 1,050మంది ప్రాణాలు కోల్పోయారు.