Chandigarh Mayor Election: 'ఇండియా' కూటమికి మొదటి పరీక్ష.. చండీగఢ్‌లో బీజేపీతో ఢీ
'సిటీ బ్యూటిఫుల్'గా పేరుగాంచిన చండీగఢ్‌లో మేయర్ ఎన్నికల్లో భాగంగా మంగళవారం పోలింగ్ ప్రారంభమైంది. ఇండియా(I.N.D.I.A) కూటమి, బీజేపీ పోటీ ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలకు ప్రాధాన్యత సంతరించుకొన్నది. అంతేకాకుండా.. ఇండియా కూటమి, బీజేపీ మధ్య జరుగుతున్న తొలిపోరు ఇదే కావడం గమనార్హం. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు చేతులు కలిపాయి. ఇండియా కూటమి నుంచి ఆప్ అభ్యర్థి కులదీప్ కుమార్, బీజేపీ నుంచి మనోజ్ సోంకర్ మేయర్ పీఠం కోసం తలపడుతున్నారు. కులదీప్ కుమార్‌కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతును ప్రకటించింది. సీనియర్ డిప్యూటీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు కాంగ్రెస్ తమ అభ్యర్థులను బరిలోకి దింపింది.
మొత్తం 35 స్థానాలకు ఎన్నికలు
కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో వాస్తవానికి జనవరి 18న పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే ప్రిసైడింగ్ అధికారి అనారోగ్యానికి గురికావడం వల్ల పోలింగ్‌ను ఫిబ్రవరి 6కి ఎన్నికల సంఘం వాయిదా వేసింది. అయితే ఈ విషయంలో జోక్యం చేసుకున్న పంజాబ్, హర్యానా హైకోర్టు జనవరి 30న పోలింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను అనుసరించి ఈరోజు ఉదయం 10గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ గురించి చెప్పాలంటే, అందులో మొత్తం 35మంది కౌన్సిలర్ స్థానాలు ఉన్నాయి. ఈ 35 ఓట్లు కాకుండా మేయర్ ఎన్నికలో ఎంపీ ఓటు కూడా చెల్లుతుంది. ప్రస్తుతం బీజేపీ నుంచి 14మంది, ఆప్ నుంచి 13మంది, కాంగ్రెస్ నుంచి ఏడుగురు, అకాలీదళ్ నుంచి ఒకరు కౌన్సిలర్లుగా ఉన్నారు.