ప్రతిపక్ష 'ఇండియా' కూటమి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం.. సీట్ల పంపకం, ప్రచార వ్యూహంపై చర్చ
లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకం, ప్రచార వ్యూహంపై చర్చలే ప్రధాన ఎజెండాగా ప్రతిపక్షాల 'ఇండియా' కూటమి కోఆర్డినేషన్ కమిటీ తొలిసారి భేటీ కాబోతోంది. దిల్లీలోని ఎన్సీపీ నేత శరద్ పవార్ నివాసంలో బుధవారం సాయంత్రం విపక్షాల కూటమిలోని 14పార్టీల నాయకులు సమావేశం కాబోతున్నారు. లోక్‌సభ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేలా సీట్లు పంచుకునే ఫార్ములాను త్వరగా రూపొందించాలని పలు ప్రతిపక్ష పార్టీల నేతలు కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే సీట్ల పంపకం విషయంలో ఇగో, స్వార్థ ప్రయోజనాలను వదులుకోవాల్సి ఉంటుందని పలువురు నాయకులు చెప్పారు. అలాగే బీజేపీని ఎదుర్కోవడానికి విస్తృతమైన ఎన్నికల ప్రచార వ్యయంపై కూడా నేతలు దృష్టి సారిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
సమావేశానికి హాజరయ్యేది వీరే
ప్రతిపక్షాల సమావేశం నేపథ్యంలో కోఆర్డినేషన్ కమిటీ సభ్యుడు రాఘవ్ చద్దా స్పందించారు. ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి ర్యాలీలను ప్లాన్ చేయడం, ఇంటింటికీ ప్రచారం నిర్వహించడం వంటి అంశాలపై చర్చిస్తామని చెప్పారు. ఈ కూటమిని విజయపథంలో నడిపించేందుకు ప్రతి రాజకీయ పార్టీ ఆశ, విభేదాలు, అభిప్రాయ భేదాలు అనే మూడు విషయాలను త్యాగం చేయాలని ఆయన అన్నారు. కెసి వేణుగోపాల్(కాంగ్రెస్), టీఆర్ బాలు(డీఎంకే), హేమంత్ సోరెన్(జేఎంఎం), సంజయ్ రౌత్(శివసేన-యూబీటీ), తేజస్వి (ఆర్‌జేడీ), రాఘవ్ చద్దా(ఆప్), జావేద్ అలీ ఖాన్(ఎస్పీ), లాలన్ సింగ్(జేడీయూ), డి.రాజా(సీపీఐ), ఒమర్ అబ్దుల్లా(నేషనల్ కాన్ఫరెన్స్), మెహబూబా ముఫ్తీ(పీడీపీ), అభిషేక్ బెనర్జీ(టీఎంసీ), సీపీఎం నుంచి ఒకరు.. ప్రతిపక్షాల ఇండియా కూటమి కోఆర్డినేషన్ కమ్ ఎలక్షన్ స్ట్రాటజీ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.