LOADING...
Andhra Pradesh: శ్రీశైలం వచ్చే వాహనాలకు నేటి నుంచి టోల్‌గేట్ల రుసుం మినహాయింపు
శ్రీశైలం వచ్చే వాహనాలకు నేటి నుంచి టోల్‌గేట్ల రుసుం మినహాయింపు

Andhra Pradesh: శ్రీశైలం వచ్చే వాహనాలకు నేటి నుంచి టోల్‌గేట్ల రుసుం మినహాయింపు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 13, 2026
08:46 am

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు దేవస్థానం, అటవీశాఖ టోల్‌గేట్ల వద్ద వసూలు చేసే రుసుం పూర్తిగా మినహాయిస్తున్నట్లు నంద్యాల జిల్లా కలెక్టర్‌ రాజకుమారి వెల్లడించారు. భక్తులకు రాత్రి సమయాల్లో కూడా రవాణాసౌకర్యం అందుబాటులో ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. గురువారం శ్రీశైలంలోని దేవస్థానం కమాండ్‌ కంట్రోల్‌ రూంలో ఎస్పీ సునీల్‌ షొరాణ్‌తో కలిసి ఆమె ఈ వివరాలు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని, బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 2,59,050మంది భక్తులు దర్శనం చేసుకున్నారని తెలిపారు. మహాశివరాత్రి రోజున సుమారు లక్షన్నర మంది భక్తులు విశ్రాంతి తీసుకునేలా అదనంగా చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

వివరాలు 

మొత్తం 3 వేల బస్సులు అందుబాటులో..

నంద్యాల-శ్రీశైలం మార్గంలో ప్రతి ఐదు నిమిషాలకు ఒక బస్సు నడుస్తోందని, ఏపీఎస్‌ఆర్టీసీ నుంచి 1,800, తెలంగాణ నుంచి 1,000, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు కలిపి మొత్తం 3 వేల బస్సులను అందుబాటులో ఉంచామని వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు, భద్రతా ఏర్పాట్లకు భక్తులు సహకరించాలని కలెక్టర్‌ కోరారు.

వివరాలు 

సమన్వయ లోపం… నడకదారి భక్తులకు అవస్థలు

అటవీశాఖ,దేవాదాయశాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల నడకదారి ద్వారా శ్రీశైలానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నడకదారిలో నల్లమల అడవిలో మొత్తం 46కిలోమీటర్ల మేర భక్తులు నడవాల్సి వస్తోంది. ఆ మార్గంలో కనీస ఏర్పాట్లు చేయాలన్నా అటవీశాఖ అధికారులు అడ్డంకులు పెడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. తమ పరిధిలో నడిచే భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ,ఆ శాఖ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేయాలన్నా అనుమతులు ఇవ్వకుండా నిరాకరిస్తున్న పరిస్థితి నెలకొంది. భక్తుల సౌకర్యాల కోసం దేవాదాయశాఖ ప్రతి ఏడాది రూ.5లక్షలు అందిస్తుండగా,అటవీశాఖ అధికారులు మాత్రం రూ.60లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారని సమాచారం. ఈ వ్యవహారంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement